ప్రస్తుతం టాలీవుడ్‌లో బ్రహ్మనందం హవా తగ్గిన తర్వాత, సునీల్ హీరో అవడంతో... వెన్నెల కిషోర్ టాప్ కమెడియన్ అయ్యాడు. స్టార్ హీరోల సినిమాల్తో పాటుగా చాలామంది మీడియం హీరోలతో సినిమాలు చేస్తూ వెన్నెల కిషోర్ బిజీగా ఉంటున్నాడు. కాకపోతే వెన్నెల కిషోర్ నటించిన చాలా సినిమాలు ఈమధ్యన వరసగా ప్లాప్ అవుతున్నాయి. అయినప్పటికీ వెన్నెల కిషోర్ డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చాలా మంది హీరోలకు వెన్నెల కిషోర్ బెస్ట్ ఛాయస్ గా మారాడు. ఇక హీరో నుండి కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ లైం టైమ్‌లో కొచ్చేసరికి వెన్నెల కిషోర్ డిమాండ్ ని తట్టుకోటం సునీల్ కి కష్టమయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి.
అంత బిజీగా వున్న ఈ కమెడియన్ వెన్నెల కిషోర్ కి ఇప్పుడొక బంపర్ ఆఫర్ తగిలిందనే న్యూస్ హైలెట్ అయ్యింది. అదేమిటంటే తమిళనాట భారీ బడ్జెట్ తో తెరక్కబోయే భారతీయుడు 2 లో వెన్నెల కిషోర్ కి అవకాశమొచ్చినట్లుగా చెబుతున్నారు. దర్శకుడు శంకర్ 2.ఓ సినిమా విడుదల తర్వాత కమల్ హాసన్ తో భారతీయుడు 2 మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ తమిళ నటులతోనే సరిపెట్టేసే శంకర్ ఈసారి భారతీయుడు 2 కోసం పలు భాషా నటులను దింపుతున్నాడు. టాలీవుడ్ నుండి ఒకరిద్దరి పేర్లు వినబడినప్పటికీ.. ప్రస్తుతం వెన్నెల కిషోర్ పేరైతే గట్టిగా వినబడుతుంది.
ఇక ఇప్పటికే శంకర్ భారతీయుడు 2 కోసం కన్నడ, మలయాళ, హిందీ నటులను ఎంపిక చేస్తున్నాడు. ఇక తాజాగా టాలీవుడ్ నుండి వెన్నెల కిషోర్ కూడా ఆ సినిమాలో భాగమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కమల్ హాసన్ వంటి స్టార్ హీరో, అలాగే గ్రేట్ డైరెక్టర్ శంకర్ సినిమాలో వెన్నెలకి అవకాశం రావడం మామూలు విషయం కాదు. మరి భారతీయుడు 2 దేశంలో చాలా భాషల్లో విడుదలవుతుంది. ఆ రకంగానూ వెన్నెల కిషోర్ చాలా భాషలకు ఈ సినిమాతో పరిచయమవుతాడు. చూద్దాం వెన్నెల కిషోర్ సుడి ఎలా వుంది అనేది.