ఒకవైపు ఎమ్మెల్యేగా, టిడిపి పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటూనే బాలయ్య వరుస చిత్రాలు చేస్తూ ఈ వయసులో యంగ్ హీరోలకు సైతం సవాల్ విసురుతున్నాడు. ప్రస్తుతం జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్దులు నిలబడిన చోట, తన అన్నయ్య హరికృష్ణ తనయ సుహాసిని బరిలో ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో కూడా ఆయన జోరుగా ప్రచారం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరోపక్క త్వరలో లోక్‌సభ ఎన్నికలు, దానితో పాటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. బహుశా ఏప్రిల్, మేలలో ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. అయినా బాలయ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. బామ్మర్ది బామ్మర్దే.. పేకాట పేకాటే అన్నట్లుగా రాజకీయాలు రాజకీయాలే... సినిమాలు సినిమాలే అని నిరూపిస్తున్నాడు.
‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వంటి హిస్టారికల్ చిత్రాన్ని, అందునా తన వందో ప్రతిష్టాత్మక చిత్రాన్ని కూడా రెండు నెలల్లో పూర్తి చేసిన ఆయన తర్వాత ‘పైసావసూల్, జైసింహా’లను కూడా అంతే వేగంగా పూర్తి చేశాడు. ప్రస్తుతం తానే మొదటిసారి నిర్మాణ భాగస్వామ్యంలో తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని కూడా ఫుల్‌స్వింగ్‌లో పూర్తి చేస్తున్నాడు. సాధారణంగా బయోపిక్ అంటే లెక్కలేనన్ని పాత్రలు, గెటప్‌లు ఉంటాయి అయినా ఎన్టీఆర్ బయోపిక్‌ని ‘కథానాయకుడు, మహానాయకుడు’గా ఆయన జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేయనున్నాడట. మరోవైపు ఆయన తన తదుపరి రెండు చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ఈ రెండింటి షూటింగ్‌ను సమాంతరంగా పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడట. సి.కళ్యాణ్ నిర్మాణంలో ‘జైసింహా’ తర్వాత వినాయక్ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు.
గతంలో వినాయక్‌తో బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం చేశాడు. మరోవైపు గతంలో తనకి ‘సింహా, లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ చిత్రంగా ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని బాలయ్య, వారాహి చలన చిత్రం సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించే అవకాశం ఉంది. వాస్తవానికి బాలయ్య వందో చిత్రాన్ని బోయపాటితో చేయాలని అభిమానుల నుంచి బాగా ఒత్తిడి వచ్చింది. ఆ కోరికను బాలయ్య ఇప్పుడు తీర్చనున్నాడు. ఇదే జోరు చూస్తుంటే బాలయ్య 150 చిత్రాలు చేయడం ఖాయమేమో అనే వ్యాఖ్యలు వినిపిస్తుండటం విశేషం.