అక్కినేని ఫ్యామిలీ హీరోలలో నాగచైతన్య కంటే అక్కినేని అఖిల్ తెరంగేట్రానికే పెద్ద ఎత్తున హైప్ వచ్చింది. మొదటి సినిమా కూడా మొదలుకాకముందు పలు మల్టీనేషనల్ బ్రాండ్స్ ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా ఆకాశానికి ఎత్తేశాయి. సాధారణంగా అక్కినేని హీరోలంటే క్లాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకుంటారు. కానీ మొదటి చిత్రం కంటే ముందే మాస్‌లో అఖిల్‌కి వచ్చిన క్రేజ్ చూసి ఆయన కూడా తన మొదటి చిత్రంతోనే భారీ బాధ్యతను భుజానికెత్తుకుని లోకాన్ని ఉద్దరించే ధీరునిగా వినాయక్ దర్శకత్వంలో మొదటి చిత్రమే తన పేరుతోనే ‘అఖిల్’ చేశాడు. ఈ చిత్రాన్ని ఎంతో పట్టుబట్టి మరీ మరో యంగ్ హీరో నితిన్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఇక రెండో చిత్రాన్ని ఆయన తండ్రి నాగార్జుననే విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో ‘హలో’ చిత్రం తీశాడు. ఇది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు.
ప్రస్తుతం ఆయన ముచ్చటగా మూడో చిత్రాన్ని తొలి చిత్రం ‘తొలిప్రేమ’తోనే తన సత్తా చాటిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా ప్లేబోయ్ పాత్రను పోషిస్తూ ‘మిస్టర్ మజ్ను’ చేస్తున్నాడు. గతంలో నాగార్జునతో దాసరి ‘మజ్ను’ చిత్రం తీసి క్లాస్ హీరోగా నాగ్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాడు. ఈ ‘మిస్టర్‌మజ్ను’ చిత్రం కూడా ‘తొలిప్రేమ’లానే ఎక్కువగా విదేశాలలో చిత్రీకరించారు. సంక్రాంతికి దిల్‌రాజు ‘ఎఫ్2’ వచ్చిన పక్షంలో ‘మిస్టర్ మజ్ను’ జనవరి 25న విడుదలయ్యే అవకాశాలున్నాయి. ‘ఎఫ్2’ పోస్ట్‌పోన్ అయితే సంక్రాంతి బరిలోకి ‘మిస్టర్‌మజ్ను’ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం స్టార్స్ అందరు తమ సొంత బేనర్లు స్థాపిస్తున్నారు. కేవలం తమ ఫ్యామిలీ హీరోల చిత్రాలనేకాదు.. బయటి హీరోలతో కూడా సినిమాలు చేస్తామని ప్రకటిస్తున్నారు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా గతంలో అదే వాగ్దానం చేశాడు. అన్నట్లుగానే చరణ్ అఖిల్ నాలుగవ చిత్రాన్ని తమ కొణిదెల బేనర్‌లో నిర్మిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ మూవీలో నటిస్తూనే ‘బాహుబలి’ రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సై..రా’ని నిర్మిస్తున్నాడు.
ఇక అఖిల్ నాలుగవ చిత్రానికి రామ్‌చరణ్ నిర్మాతగా ఉంటూ బోయపాటి శ్రీనుని దర్శకునిగా ఎంచుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ‘వినయ విధేయ రామ’ షూటింగ్ సెట్స్‌లోనే బోయపాటి చరణ్‌కి అఖిల్ కోసం ఓ కథ చెప్పడం, దానికి చరణ్ ఓకే చేయడం జరిగిపోయాయట. ఇక నాలుగవ చిత్రం ఏకంగా హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించే బోయపాటితో అయితే మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలన్న అఖిల్ ఆశ నెరవేరుతుందనే చెప్పాలి.