సినిమా వారికి ఉండే క్రేజ్ రాజకీయ నాయకులకు కూడా ఉండదు. రాజకీయ నాయకుల సభలకైనా బిర్యాని, బీరు, రోజుకింతని డబ్బు ఇచ్చి జనాలను తోలాల్సివస్తుంది. అదే ఒక సినీస్టార్ వచ్చాడంటే ఓట్లు పడతాయో లేదో తెలియదు గానీ ఉచిత పబ్లిసిటీ లభిస్తుంది. వారిని చూడటానికి తండోపతండాలుగా జనాలు వేలం వెర్రిగా వస్తారు. అయితే వీరంతా వారికే ఓట్లు వేస్తారా? అంటే అనుమానమే. ఇక స్టార్ హీరోలకు ధీటుగా హీరోయిన్లంటే జనాలు పడిచస్తారు. వారిని ఒకసారి చూడాలని అయినా క్యూ కడతారు. సన్నిలియోన్ నుంచి సీనియర్ నటి నగ్మా వరకు ప్రతి ఒక్కరికి ఈ క్రేజ్ ఉంది. సన్నిలియోన్ కేరళలోని తిరువనంతపురం వస్తే మోహన్‌లాల్, మమ్ముట్టిలను చూడటానికి కూడా అంత జనం రారేమో అన్నట్లుగా జనం పోటెత్తారు.
ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నటి నగ్మా ప్రచారం చేసింది. ఆ సభల్లో కూడా ఆమెని చూసేందుకు వచ్చిన జనం వల్ల నగ్మాకి చుక్కలు కనిపించాయి. ఓ వ్యక్తి ఆమెని తాకరాని చోట తాకడం కూడా సంచలనాలకు కేంద్రబిందువు అయింది. ఇక తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా నగ్మా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్ధుల తరపున ఆమె ప్రచారం సాగుతోంది. మధ్యప్రదేశ్‌లోని శివపురి నియోజకవర్గంలో ఆమె ప్రచారం చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆమెను చూసేందుకు, దగ్గరగా వచ్చేందుకు ఎగబడ్డారు. ఆమె కోసం స్టేజీ మీద ఉన్న ఇద్దరు నాయకులు కొట్టుకోవడం మరింత విడ్డూరం. నగ్మా వారిని వారించే ప్రయత్నం చేసింది. అనంతరం ఆమె ప్రసగించింది.
ఆమె మాట్లాడుతూ, నిర్ణీత సమయానికి సభాస్థలికి చేరుకోలేకపోయినందుకు క్షమాపణలు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వర్గీయులు అడ్డుకోవడం వల్లే జాప్యం జరిగింది.... అని చెప్పుకొచ్చింది. ఈ సందర్బంగా ఆమె శివపురి, గ్వాలియర్, కరేరా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృత ప్రచారం చేశారు. మొత్తానికి ఈ పర్యటనలో అభిమానం హద్దులు మీరడంతో నగ్మాకి చుక్కలు కనిపించాయనే చెప్పాలి.