ఇంతకాలానికి జనసేనాధిపతి దారిలోకి వచ్చాడు. తనకి టిడిపితో పాటు వైసీపీ కూడా అంతే దూరమని చాటాడు. మైనింగ్‌లకు ఓకే చెప్పింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డినే అనే వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. జగన్ అధికారంలోకి వస్తే దోచుకుంటాడని, ఈ అక్రమ మైనింగ్‌ల వల్ల గిరిజనుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని, వీటి వల్లనే విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు నక్సల్ చేతిలో హత్యకు గురయ్యారని అన్నాడు. ఇకపోతే ప్రత్యేకహోదా సాధన సమితికి చెందిన నాయకుడు హీరో శివాజీ ‘ఆపరేషన్ గరుడ’ విషయంలో చెప్పినవి ఎలా నిజమని నిరూపితం అవుతున్నాయో పవన్ చెప్పే మాటలు నిజం కావడం, పలువురి మద్దతు లభించడం కూడా జరుగుతుండటం విశేషం.
జల్లికట్టు ఉద్యమ నేపధ్యంలో జరిగిన ప్రత్యేకహోదా ఉద్యమాన్ని పందుల పోటీతో పోల్చిన నాటి విర్రవీగిన కేంద్రమంత్రి సుజనాచౌదరి బ్యాంకులకు ఎన్నోకోట్లు ఎగ్గొట్టి నాయకుడిగా చెలామణి అవుతున్నాడని నాడు పవన్ ఆరోపించాడు. అన్నట్లుగానే తాజాగా ఈడీ దాడుల్లో డొల్ల కంపెనీల ద్వారా బ్యాంకులకు సుజనాచౌదరి 5.700 కోట్లవరకు ఎగ్గొట్టాడనే నిజం భయటపడింది. ఇక పవన్ తన ఇంతకాలం రాజకీయ కెరీర్‌లో ఏ ఎమ్మెల్యేపై చేయని విధంగా చింతమనేని ప్రభాకర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇప్పుడు పవన్ ఆరోపణలకు సినిమా రంగానికే చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ మద్దతు లభించింది. తాజాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై అపూర్వ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆమె మాట్లాడుతూ, చింతమనేని వేధింపులు ఎక్కువయ్యాయి. ఇక ఆయన మరోసారి ఎమ్మెల్యే అయితే నేను ఇక్కడ ఉండలేను. ఆస్తులన్నీ అమ్ముకుని తెలంగాణకు వెళ్లిపోతాను. ఆయన మాకు నరకం చూపిస్తున్నాడు. నాది కూడా కమ్మ సామాజిక వర్గమే. అయినా నాకు కులపిచ్చి లేదు. మొదటి నుంచి మేమంతా టిడిపికే ఓట్లు వేస్తున్నాం. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలని దేవుడిని కూడా ప్రార్ధించాను. మేము ఓట్లు వేసి గెలిపించిన చింతమనేనినే మాకు ఇలా నరకం చూపిస్తున్నాడు. నా తల్లి గుండెజబ్బుతో బాధపడుతోంది. ఆమె బాగోగులు చూసుకుంటూ ఉండటం వల్లే సినిమాలలో అవకాశాలు వస్తున్నా కూడా నటించడం లేదు. అమ్మ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మరలా నటిస్తానని చెబుతూ, ఆమె చింతమనేని విషయంలో తీవ్ర ఆవేదనను వ్యక్తం చేయడం గమనార్హం.