ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నాడు. దీనిని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ‘కథానాయకుడు, మహానాయకుడు’లుగా ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులో నాటి ఎన్టీఆర్‌తో అనుబంధం ఉన్న సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల పాత్రలో ఎందరో నటీనటులు కామియో పాత్రలను చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య సరసన అత్యధికమంది హీరోయిన్లు నటిస్తున్న చిత్రం ఇదే కావచ్చు.
ఇక విషయానికి వస్తే ఎన్టీఆర్ సినిమాలలో తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్నతరుణంలో జయసుధతో ఆయన నటించిన ‘డ్రైవర్‌రాముడు’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇంతేగాక ‘యుగంధర్, కేడీనెంబర్1, అనురాగదేవత, లాయర్ విశ్వనాథం, రామకృష్ణులు’ వంటి పలు చిత్రాలలో ఈ జోడీ నటించింది. ఇక ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చే ముందు నటించిన చివరి చిత్రం ‘నా దేశం’లోనూ, రాజకీయాలలోకి వచ్చిన తర్వాత నటించిన ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ చిత్రాలలో కూడా జయసుధనే హీరోయిన్. ఈమెకి ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది.
కాగా ఎన్టీఆర్ బయోపిక్‌లో జయసుధ పాత్రకు క్రిష్ ఏరికోరి ‘ఆర్‌ఎక్స్ 100’భామ పాయల్ రాజ్‌పుత్‌ని తీసుకున్నాడని సమాచారం. పాయల్ హావభావాలు, ముఖకవళికలు అచ్చు జయసుధలా ఉంటాయనే కారణంతోనే ఆ పాత్రను ఆమెకిచ్చినట్లు తెలుస్తోంది. ఇక జయప్రద పాత్రకు హన్సికను తీసుకున్నాడట. కమర్షియల్ ఫార్ములా చిత్రాలకు రిఫరెన్స్‌లా, టాలీవుడ్ ‘షోలే’లా కీర్తించబడే ‘అడవిరాముడు’ చిత్రంలో ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట అప్పటికీ, ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ అనే చెప్పాలి. ఇక ‘యుగపురుషుడు’ చిత్రంలో కూడా ఎన్టీఆర్‌కు జతగా జయప్రద నటించిన సంగతి తెలిసిందే.