తెలుగు కుర్రాడు విశాల్ తమిళనాట మంచి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన తెలుగులో ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. ఇందులోని తాజాగా లుక్ ఇటీవల బయటకు వచ్చింది. ఈ పోస్టర్‌లో నెగటివ్ ఛాయలుంటే పోలీస్ ఆఫీసర్ పాత్ర కాబట్టి విశాల్ కూడా పోలీస్‌జీపుపై కూర్చుని బీర్ సీసాతో కనిపించాడు. ఇంకేముంది.. విశాల్‌ని చూసే అందరు చెడిపోతున్నారన్నట్లుగా తమిళనాట కొందరు ఎంతమందికో ఆదర్శవంతుడు, పలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న విశాల్ ఇలా ప్రజలను తప్పుడు మార్గంలో చూపించే విధంగా చేతిలో బీర్‌తో ఎలా కనిపిస్తాడని విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.
ఇది జరిగిన రెండు రోజులకే సినిమాలు వేరు.. నిజజీవితం వేరని విశాల్ నిరూపించాడు. తమిళనాటు ‘గజ’ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయి, నామరూపాలు లేకుండా అయిపోయిన ఓ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నాడు. తంజావూర్ జిల్లాలోని కరగవయాల్ అనే గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించాడు. నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా, నిర్మాతల మండలి అధ్యక్షునిగా పనిచేస్తున్న విశాల్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
ఆయన మాట్లాడుతూ, ఇక ఈ గ్రామం బాధ్యత నాదే. ఈ గ్రామానికి పూర్వవైభవం తీసుకుని వస్తాను. ఇది నా బాధ్యత. దీనిని మోడల్ విలేజీగా తీర్చిదిద్దుతాను. దీనికి సాయం చేస్తున్న సోషల్ ఆర్కిటెక్ట్స్ జట్టుకి ఐ లవ్‌యు. మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను... అని తెలిపాడు. దీనిపై ఆ గ్రామం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిత్లీ తుఫాన్ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని గ్రామాన్ని రామ్‌చరణ్ దత్తత తీసుకున్న దారిలోనే విశాల్ కూడా నడుస్తుండటం ఆనంద దాయకమని చెప్పాలి.