ప్రస్తుతం ఎన్టీఆర్‌పై బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ రూపొందుతోంది. ఇది స్వయాన ఎన్టీఆర్ తనయుడు నటిస్తున్న చిత్రం కావడం, అందునా బాలయ్య టిడిపికి మరీ ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి కావాల్సిన వాడు కావడంతో దీనిలో ఎన్టీఆర్ జీవితంలోని చీకటి కోణాలను చూపిస్తారని ఆశించడం అవివేకమే అవుతుంది. ఇక ఈ చిత్రం విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవు. తెలుగుదేశం పార్టీ వారి సపోర్ట్ కూడా వీరికి ఉంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు వైసీపీ నేతల అండతో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తీస్తున్నాడు.
ఇది కాస్త లక్ష్మీపార్వతికి అనుకూలంగా, వైసీపీ నేతలకు బాగా నచ్చేలా, చంద్రబాబు, బాలయ్య వంటి వారిని కాస్త వివాదాస్పదంగా చూపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే అసలు లక్ష్మీపార్వతి ఎవరు? ఎందుకు ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చింది? అనే ఎవ్వరికీ తెలియని కథతో కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ తీస్తానని చెప్పాడు. కానీ ఆయన వెనుక ఏ పార్టీ అండదండలు లేవు దాంతో ఆయన చిత్రానికి అడుగడుగునా ఆటంకాలే ఏర్పడుతున్నాయి. ఇక విషయానికి వస్తే తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, వర్మ తాను తీసే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తానే తీసిన ‘GST’.. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ కంటే అడల్ట్ కంటెంట్‌తో ఉంటుందని చెప్పాడు. ఈ విషయాన్ని ఆయన ఓ టీవీ డిబేట్‌లో వెల్లడించాడు.
లక్ష్మీపార్వతి ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి. ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ పేరుతో నేను చిత్రం తీస్తుంటే లక్ష్వీపార్వతి అడ్డుపడుతోంది. వర్మతో లక్ష్మీపార్వతి ములాఖల్ అయ్యారు. అందుకే అడల్ట్ కంటెంట్ ఉంటుందని చెప్పినా లక్ష్మీపార్వతి దానిని గురించి అభ్యంతరం చెప్పడం లేదు. వర్మ చెబుతున్న దానికి లక్ష్మీపార్వతి అనుమతి ఉన్నట్లేనా? లక్ష్మీపార్వతి భావిస్తున్నట్లు, చెప్పినట్లు వర్మ సినిమా తీయడు. ఆయనకు మనసుకి నచ్చిన వాటిని సినిమాలో చూపిస్తాడు. దాని కోసం అవాస్తవాలు చూపించడానికి కూడా వెనుకాడదు. ఇలాంటి సినిమాతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. ఓ యవ్వనంలో ఉన్న యువతికి వయసు మళ్లిన వ్యక్తికి మధ్య ఏర్పడే ప్రేమ, పెళ్లే నా చిత్రం కథ. నా చిత్రం విషయంలో, వర్మ మూవీ విషయంలో ఇప్పటికైనా లక్ష్వీపార్వతి మేల్కొనాలని కోరాడు.