కన్నడ పరిశ్రమలో అంబరీష్‌కి రెబెల్‌స్టార్ అనే బిరుదు ఉంది. ఆయనది కూడా తెలుగులో మోహన్‌బాబు వంటి వ్యక్తిత్వమని ఓ ఇంటర్వ్యూలో ఆయన భార్య, తెలుగు సీనియర్ హీరోయిన్ సుమలత చెప్పుకొచ్చింది. బయటకు చాలా కోపిష్టిగా కనిపిస్తాడే గానీ ఆయన మనస్సు ఎంతో సున్నితమని ఓ సారి తాను అంబరీష్‌ని వివాహం చేసుకోబోతున్నానని చెబితే సుహాసిని భయపడి పోయిందని... ఇక అంబరీష్‌కి ఎప్పుడు వీలు చిక్కినా మోహన్‌బాబు, చిరంజీవిలతో ముచ్చటించే వారని కూడా ఆయన శ్రీమతి సుమలత తెలిపింది. అలాంటి అంబరీష్ 66ఏళ్ల వయసులో కార్డియాక్ ప్రాబ్లంతో కన్నుమూశారు. దాంతో ఆయనను చూసేందుకు అభిమానులు వేలాది మంది తరలివచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని ఉంచిన కంఠీరవ స్టేడియం దాదాపు నిండిపోయింది.
ఇక అంబరీష్ మృతదేహాన్ని చూసేందుకు భార్య సురేఖతో కలిసి చిరంజీవి బెంగుళూరు వెళ్లారు. ఈ సందర్భంగా సుమలతని ఓదార్చిన ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఇక మంచు విష్ణుతో కలిసి వచ్చిన మోహన్‌బాబు అంబరీష్ మృతదేహం చూసి బోరున విలపించాడు. సుమలతను ఓదారుస్తూ తానే దు:ఖాన్ని ఆపుకోలేక బోరున విలపించాడు. సహజంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా గుండె నిబ్బరంతో ఉండే మోహన్‌బాబు ఇంత బోరున విలపించడం ఇదే మొదటిసారి అని చెప్పడం అతిశయోక్తి కాదనే చెప్పాలి.
ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా సుమలతను ఓదార్చే క్రమంలో ఉద్వేగానికి లోనై కంట తడి పెట్టాడు. ఆప్తమిత్రుడిని కోల్పోయానని విలపించాడు. ఇక ‘ఈగ, బాహుబలి’లో నటించిన కన్నడ స్టార్ సుదీప్ అంబరీష్‌కి మంచి ఆప్తుడు. అంబరీష్ చివరి చిత్రం కూడా సుదీప్‌దే కావడం గమనార్హం. ఈయన కూడా ఎంతగానో బాధపడ్డాడు. అజాత శత్రువుగా పేరుపొందిన అంబరీష్ మృతదేహాన్ని చూసి కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా కన్నీరు ఉబికి వస్తుంటే వాటిని ఆపుకోవడానికి ఆయన పడిన ప్రయత్నం అందరినీ కంటతడి పెట్టించింది.