తమిళంలో మురుగదాస్ - విజయ్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమాగా తెరకెక్కిన సర్కార్ సినిమా దీపావళి కానుకగా విడుదలైంది. సినిమా మీద భారీ అంచనాలతో థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకు సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. క్రిటిక్స్ తో సహా ప్రేక్షకులంతా సర్కార్ ని యావరేజ్ గా తేల్చేశారు. మురుగదాస్ స్పైడర్ సినిమా డిజాస్టర్ ఇచ్చాడు.. మళ్ళీ సర్కార్ తో మరో ప్లాప్ మూటగట్టుకున్నాడన్నారు. అసలే సినిమాకి డివైడ్ టాకొచ్చి చిత్ర బృందం టెన్షన్‌లో ఉంటే... మరోపక్క తమిళనాట అన్నాడీఎంకే కార్యకర్తలు సర్కార్ సినిమాని వివాదాల్లో పడేసారు. అయితే ఎన్ని వివాదాలొచ్చినా, ఎంత నెగిటివ్ టాకొచ్చినా సినిమా కలెక్షన్స్ విషయంలో దుమ్ము దులిపేసింది.
తెలుగులో డివైడ్ టాకొచ్చినా సినిమా కొన్న నిర్మాతలు ఓ మోస్తరు లాభాలతో బయటపడగా... బయ్యర్లు కూడా కాస్త లాభాలు వెనకేసుకున్నారు. ఇక తమిళంలో యావరేజ్ టాకొచ్చినా... కలెక్షన్స్ మాత్రం అదుర్స్ అనే రేంజ్ లో ఉన్నాయన్నారు. తమిళనాట 70 కోట్ల షేర్స్ సాధించిన మెర్సల్, బాహుబలి సరసన ఈ సర్కార్ మూవీ కూడా చేరింది. మరి 70 కోట్ల షేర్ ని తమిళనాట సాధించినా... సర్కార్ బయ్యర్లకు నష్టాలే వచ్చాయట. తమిళనాట సర్కార్ కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కేవలం 90 శాతం మాత్రమే సర్కార్ వెనక్కి తెచ్చిందని.. మిగతా 10 శాతం బయ్యర్లు నష్టపోయారంటున్నారు.
మరి ఈ చిత్ర నిర్మాతలు లాభాలతో గట్టెక్కినా.. బయ్యర్లు మాత్రం 10 శాతం నష్టపోయారు. అయితే పది శాతం నష్టాలంటే పెద్ద విషయమే కాదు. ఎందుకంటే సర్కార్ కొచ్చిన టాక్ వలన బయ్యర్లకు 50 శాతం నష్టాలూ మిగులుస్తుందేమో అనుకుంటే.. ఎలాగోలా విజయ్ క్రేజ్‌తో సర్కార్ సినిమా టాక్‌తో సంబంధమే లేకుండా కలెక్షన్స్ కురిపించింది. అందుకే అన్నారు కలెక్షన్స్ అదుర్స్... అయినా బయ్యర్లు నష్టాలూ పాలవడం అంటే ఇదే.