సాధారణంగా ఏదైనా చిత్రం విడుదల ఆలస్యమైనా, లేక రీషూట్స్ జరుపుకుంటోందని తెలిసినా ఆ చిత్రం ఫలితంపై అందరు అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఆలస్యం అయ్యే కొద్ది సినిమా విజయావకాశాలు, హైప్ తగ్గుతుందని భావిస్తారు. ఇక అందునా ఆ చిత్రం లీక్ అయితే ఇక ఆయా దర్శక నిర్మాతలు, హీరోలు పడే ఆవేదన చిన్నగా ఉండదు. అది కొందరికి పైశాచిక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఇక విషయానికి వస్తే విజయ్‌దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ అనే యాడ్ ఫిల్మ్‌మేకర్ దర్శకునిగా పరిచయం అవుతూ ‘ట్యాక్సీవాలా’ రూపొందింది. కానీ ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందునా దాని తర్వాత విడుదల కావాల్సిన విజయ్‌దేవరకొండ ‘నోటా’ ముందుగా విడుదల కావడం, అది డిజాస్టర్ కావడం మరింత కలవరపాటుకి గురి చేసింది. డబ్బింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్స్ జరగని సినిమా లీక్ అయింది. దీంతో ఈ మూవీ మొదటి నుంచి సమస్యల వలయంలోనే ఉంటూ వచ్చింది.
చివరకు ఈ మూవీని గీతాఆర్ట్స్ విడుదల చేయడం లేదని, ప్రింట్‌ని తగులబెట్టేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇంత బ్యాడ్ కామెంట్స్ మధ్య ఈ చిత్రం విడుదలై మొదటిరోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. రెండు వారాల పాటు అంటే ‘2.ఓ’ వచ్చే దాకా ఈమూవీకి తిరుగే ఉండదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సో.. ‘గీతగోవిందం’ తరహాలోనే ఈ మూవీ కూడా కాసుల వర్షం కురిపించడం ఖాయమని తేలింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌లో జరిగిన పలు ఆసక్తికర విశేషాలను దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే కోలీవుడ్‌లో నయనతార నటించిన ‘డోరా’ అనే చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. అది కూడా కారులో ఆత్మ అనే కాన్సెప్ట్ అని తెలిసి భయపడిపోయాను. దాంతో రెండు రోజులు ఈ మూవీ షూటింగ్‌ని ఆపివేశాను. ట్రైలర్ విడుదలైన తర్వాత కంప్లీట్‌గా షూటింగ్ ఆపేసి ‘డోరా’ విడుదలయ్యే వరకు షూటింగ్ జరపలేదు. ఈ మూవీ విడుదలైన వెంటనే వెళ్లి చూశాను. మొదట్లో కాస్త ‘డోరా’, ‘ట్యాక్సీవాలా’ల కథలు కాస్త పోలికగా ఉన్నా కూడా ఆ తర్వాత ఆ చిత్రానికి మా కథకు ఏమాత్రం సంబంధం లేకపోవడం ఆనందాన్ని కలిగించింది. నాకొచ్చి ఆలోచనే మరొకరి ద్వారా ‘డోరా’గా వస్తోందని తెలిసి బాగా డిప్రెస్ అయ్యాను. ఇప్పుడు ఈ చిత్రం సాధిస్తున్న విజయంతో యూనిట్ మొత్తం ఎంతో ఆనందంగా ఉన్నామని తెలిపాడు. కాగా గతంలో నరసరాజు దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ‘కారు దిద్దిన కాపురం’ కూడా కారులో ఆత్మ కథే. ఇలా కొన్నిసార్లు అనుకోని విధంగా ఒకే పోలికలు, ఆలోచనలు వచ్చే సంఘటనలు ఎదురవుతుంటాయి. మొత్తానికి మొదటి చిత్రంతోనే రాహుల్ సంకృత్యాన్ విజయం సాధించడమే కాదు.. విజయ్ దేవరకొండకి ‘నోటా’ని మర్చిపోయే హిట్ ఇచ్చాడనే చెప్పాలి.