ప్రస్తుతం దేశవ్యాప్తంగా శంకర్-రజనీ-అక్షయ్‌కుమార్‌ల ‘2.ఓ’ ఫీవర్ ఉంది. ఈ చిత్రాన్ని 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఏడు వేల స్క్రీన్లలో విడుదల చేయనున్నాడు. తమిళనాడులో కంటే రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ థియేటర్లలో విడుదల చేయనుండటం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఏకంగా వెయ్యి ధియేటర్స్‌లో ఈ సినిమా విడుదలకానుంది. నైజాంలోనే 400లకు పైగా థియేటర్లలో, ఒక్క హైదరాబాద్‌లోనే 100కి పైగా స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల కానుండటంతో తెలుగు స్టార్ హీరోల చిత్రాలకు సరిసమానంగా ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇక ఏకంగా ఆరువందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ పెద్ద డైరెక్టర్ చిన్నపిల్లల కోసం తీసిన చిత్రం ‘2.ఓ’ అని ఆయన ట్వీట్ చేశాడు. కానీ ‘భైరవగీత’ చిత్రం మాత్రం ఓ చిన్నపిల్లోడు పెద్దల కోసం తీసిన చిత్రంగా దానిని అభివర్ణించాడు. ‘భైరవగీత’ చిత్రాన్ని రామ్‌గోపాల్ వర్మ సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 30న అంటే ‘2.ఓ’కి పక్క రోజున ఈ మూవీ విడుదల కానుంది. శంకర్, రజనీ, అక్షయ్‌కుమార్‌ల కాంబినేషన్‌కి భయపడకుండా తమ చిత్రాన్ని ఆయన థియేటర్లలోకి దింపుతున్నాడు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ఈ రెండు సినిమాలు ఓకేసారి విడుదల కాబోతున్నాయి.
ఈ రెండు చిత్రాలలో ప్రతి చిత్రానికి దానికి తగ్గ ఆడియన్స్ ఉంటారని, కాబట్టి 30న విడుదల చేయడం తనకేమీ టెన్షన్ అనిపించడం లేదని ఆయన తెలిపాడు. మొత్తానికి తన చేతగానితనాన్ని, తన చిత్రం ప్రమోషన్స్ కోసం ‘2.ఓ’ని చిన్నపిల్లల కామిక్ మూవీగా వర్మ అభివర్ణించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. తమిళనాడులో కూడా రజనీ అభిమానులు ఈ వ్యాఖ్యల పట్ల గుర్రుగా ఉన్నారు. మరి ‘భైరవగీత’ ఫలితం ఎలా ఉంటుందో త్వరలోనే తెలియనుంది.