కన్నడ రెబెల్‌స్టార్‌గా పేరు తెచ్చుకుని, రాజకీయ నాయకునిగా కూడా రాణించిన సీనియర్ కన్నడ హీరో అంబరీష్ మృతి చెందారు. ఆయన వయసు 66 ఏళ్లు. తెలుగమ్మాయి, నాటి హీరోయిన్ అయిన సుమలతను ఆయన 1991లో వివాహం చేసుకున్నాడు. ఇక అంబరీష్ 1952 మే 29న నాటి మైసూర్ రాజ్యంలోని మాండ్య జిల్లాలోని దొడ్డరసినకెరెలో జన్మించారు. ఆయన అసలు పేరు గౌడా అమర్‌నాథ్.
1972లో ప్రముఖ కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్ తెరకెక్కించిన ‘నాగరహావు’ చిత్రం ద్వారా నటునిగా పరిచయం అయ్యాడు. కన్నడలో రెబెల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఆయన దాదాపు 200లకి పైగా చిత్రాలలో నటించాడు. 2013లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన కర్ణాటక నుంచి గెలుపొందారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అంబరీష్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మిగిలిపోయింది. పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయన మృతిపై తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈయన గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచారు.
అంబరీష్ మృతిపై సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాడు. నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయానని ఆయన ఆవేదన చెందారు. ఆయనను మిస్ అవుతున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య కూడా అంబరీష్ కుటుంబానికి సంతాపం ప్రకటించాడు. అంబరీష్ గొప్ప నటుడే కాదు.. గొప్ప రాజకీయ నేత కూడా. అన్నింటికి మించి ఆయన ఎంతో మంచి మనసున్న మహామనిషి. ఆయన మృతి నన్ను ఎంతో బాధిస్తోందని సిద్దరామయ్య తెలిపారు.