తెలుగులో అతి తక్కువ చిత్రాలతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న మలయాళ కుట్టి కీర్తిసురేష్. ఈమె తన తొలి తెలుగు చిత్రం ‘నేను..శైలజ’తోనే తన టాలెంట్‌ని చూపించింది. గ్లామర్‌షో లేకుండా కూడా టాప్ హీరోయిన్ ఎలా కావచ్చు అనే విషయం నేటితరానికి తెలిసి వచ్చేలా చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఇక పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’లో చాన్స్ దక్కించుకున్నా ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో ఈమె మరింతగా ఎలివేట్ కాలేదు. అయితే ఈమె గత చిత్రాలన్నీ ఒక ఎత్తైతే ‘మహానటి’లో ఈమె మహానటి సావిత్రిగా జీవించిన విధానం అందరి ప్రశంసలను అందుకుంది. ఏకంగా ఈమెని కూడా మహానటి అని పిలిచేంతగా తన సత్తా చాటింది.
కానీ ఆ తర్వాత వరుసగా విశాల్, విక్రమ్, రెండు సార్లు విజయ్ వంటి స్టార్స్‌తో జతకట్టింది. తెలుగులో ఏ చిత్రానికి ఓకే చెప్పకపోయినా కూడా తమిళంలో మాత్రం ఈమె కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇక విషయానికి వస్తే ఈమె హీరో నానితో కలిసి నటించిన ‘నేను లోకల్’ చిత్రం ఘనవిజయం సాధించడమే కాదు.. వీరిద్దరు మేడ్‌ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారనే పేరు వచ్చింది. ఇక నాని ప్రస్తుతం తెలుగులో ‘జెర్సీ’ చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత ఆయన మోహనకృష్ణ ఇంద్రగంటి, చంద్రశేఖర్ యేలేటి చిత్రాలలో నటించడానికి ఓకే చెప్పాడు. ఇందులో చంద్రశేఖర్ యేలేటి తాను నానితో చేసే చిత్రంలో కీర్తిసురేష్ అయితే బాగుంటుందని ఆమెని హీరోయిన్ పాత్రకి అడిగాడట. నాని తనకు మంచి స్నేహితుడే అయినా, మరోవైపు చంద్రశేఖర్‌యేలేటి ఎంతో ప్రతిభావంతుడైన డైరెక్టర్ అయినా కూడా ఈ చిత్రానికి ఆమె నో చెప్పిందట.
పోనీ బిజీ వల్ల చెప్పిందా! అంటే కాదని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి తాను ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో తీసే రియల్ బిగ్ మల్టీస్టారర్ చిత్రంలోని ఓ హీరోయిన్ పాత్రకి కీర్తిసురేష్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో ఆమె నటిస్తే ఆమెకి దేశవ్యాప్త గుర్తింపు వస్తుంది. అయితే ఈ మూవీని ఓకే చేస్తే ఆమె బల్స్ కాల్షీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే కీర్తి.. నాని, యేలేటి సినిమాకి నో చెప్పిందనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో సాగుతోంది. మరి ఇందులో ఏది నిజమో వేచిచూడాల్సివుంది...!