రజనీకాంత్.. ఈ పేరు చెబితేనే స్టైల్ అంటే ఆయనదే అనిపిస్తుంది. ఆయనకు దేశవిదేశాలలో, జపాన్, మలేషియా వంటి దేశాలలో కూడా వీరాభిమానులు ఉన్నారు. ఆయన నడిచినా, చేయి ఎత్తినా, జుట్టు సరిచేసుకున్నా.. అదే స్టైల్ అవుతుంది. ఈయన చేసే ప్రతి హావభావం, ప్రతి భంగిమ ఆయనలోని మ్యాన్లీనెస్‌ని నిలువెత్తు రూపంగా ఉంటుంది. అందుకే పెద్ద అందగాడు, ఆరడుగుల ఆజానుభావుడు, ఎర్రగా బుర్రగా లేకపోయినా ఆయనంటే అందరు పడిచస్తారు. ఇక ఈయన నిజజీవితంలో కూడా ఎంతో సింపుల్‌గాఉంటారు. నలిగిపోయిన లాల్చీ వేసుకుని, బట్టతలపై, చింపిరి గడ్డంతో ఆయన జీవన విధానం ఎంతో సింపుల్. ఇక ఆధ్యాత్మిక భావనలు, హిమాలయాలలో ఎక్కువ సమయం గడపడం వంటివి ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. అలాంటి రజనీ తనలోని మైనస్‌లను కూడా ఎంతో హుందాగా, పెద్ద మనసుతో స్వీకరిస్తూ ఉంటారు.
ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ‘శివాజీ, రోబో’ ల తర్వాత హ్యాట్రిక్ మూవీగా ‘2.ఓ’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ప్రతినాయకునిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 29న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రజనీ మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నా ఆరోగ్యం బాగా లేదు. ఓ సీన్ కోసం ఏడు టేకులు తీసుకున్నాను. ఈ ఘటన నాపై నాకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది. ఈ సినిమాలో నటించలేనని ముందుగానే నేను శంకర్‌కి చెప్పాను. నాకు అనుకూలంగా సినిమా షూటింగ్‌ను, పాత్రను ప్లాన్ చేస్తానని చెప్పి శంకర్ నన్ను ఒప్పించారు. నేను బాడీ సూట్‌లు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదని కూడా చెప్పారు. కానీ నేనే బాడీసూట్‌లు వేసుకున్నాను. తొలిసారి ప్రతినాయకునిగా నటించిన అక్షయ్‌కుమార్ గెటప్ చూసి ఎంతో ఆశ్చర్యపోయాను... అని చెప్పుకొచ్చాడు.
‘2.ఓ’ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ మూవీ చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకి హైలైట్ అని, ప్రేక్షకులు సీట్ల ఎడ్జ్‌లపై నిలబడేలా చేస్తుందని తెలుస్తోంది. ఈ మూవీ మీద ఉన్న నమ్మకంతో తెలుగు సుప్రపిద్ద నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న ఎన్వీప్రసాద్, దిల్‌రాజు, యూవి క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేయనుండటంతో దీనికి తెలుగులో కూడా విపరీతమైన హైప్ ఏర్పడింది. మరి రజనీ, శంకర్, రెహ్మాన్, అక్షయ్‌కుమార్ వంటి వారు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వెండితెరపై చూస్తే గానీ తెలియదని చెప్పాలి.