ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయి. బొమ్మా, బొరుసు రెండూ ఉంటాయి. కాబట్టి రెంటిని అర్ధం చేసుకుని ముందుకు పోయే వాడే నిజమైన పెద్ద మనిషి అవుతాడు. ఆమాత్రం సామాజిక స్పృహ, సమస్యలపై అవగాహన లేని వారు సూపర్‌స్టార్ అయినా, మెగాస్టార్ అయినా ఒక్కటే. ఇక విషయానికి వస్తే మలయాళంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న గొప్పనటుల్లో మోహన్‌లాల్ ఒకరు. పేరుకే మెగాస్టార్ గానీ ఈయన నిజజీవితంలోని చేష్టలు చూస్తే జీరోస్టార్ అనిపించకమానదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు.. విదేశాలలో కూడా మీటూ ఉద్యమం జోరందుకుంది. ఇంతకాలం పెద్దల చిన్నబుద్దుల వల్ల పరిశ్రమలో గొప్పవారిగా పేరు తెచ్చుకున్న ఒక్కోక్క ప్రముఖుడి పేరు వింటే నోరు వెళ్లబెట్టాల్సిందే. అలాగని ఈ ఉద్యమం అంతా నిజాయితీ ఉందని ఎవ్వరూ అనుకోరు. వీరిలో కొందరు పబ్లిసిటీ కోసం, కక్ష్యసాధింపు కోసం కూడా చేసే వారు ఉన్నారు.
ఏ ఉద్యమంలోనైనా ఇలా మంచి చెడు రెండు ఉంటాయి. అంత మాత్రాన ఆ ఉద్యమం ఉద్దేశ్యాన్ని మూలాన్నే కించపరచడం సహేతుకం అనిపించదు. చివరకు రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి వారు కూడా ఈ ఉద్యమం నిజాయితీగా సాగితే మద్దతు ఉంటుందని, దయచేసి దీనిని తప్పుగా వాడుకోవద్దని సూచించారు. మలయాళ నటి భావన లైంగిక వేధింపులలో తన సహనటుడు దిలీప్ నిందితుడైనప్పటికీ, నిజానిజాలు తెలుసుకోకుండా దిలీప్‌కి మద్దతు ఇచ్చాడు. ‘మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’, ‘అమ్మా’ నుంచి దిలీప్‌ని సస్పెండ్ చేయకుండా ఆయనకు మద్దతుగా నిలిచి తన పరువు పోగొట్టుకున్నాడు.
తాజాగా దుబాయ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ‘మీటూ’ ఉద్యమం గురించి నీచంగా మాట్లాడాడు. మీటూ ఉద్యమం మూణ్ణాళ్ల ముచ్చటే. మలయాళ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు లేవు. లైంగిక వేధింపులనేవి అన్ని రంగాలలో ఉంది. మీటూ అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటివి ఎక్కువ కాలం నిలబడవు. మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగుస్తాయి. పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారు. ఈ ఉద్యమం ఓ పనికి మాలినది. ఇదొక వెర్రిలా మాట్లాడింది అంటూ వ్యాఖ్యానించాడు. దాంతో పలువురు ఆయనపై ఆయనకు ఉన్న సామాజిక బాధ్యత, అవగాహన ఇంతేనా అని మండిపడుతున్నారు. ఈయన సూపర్‌స్టార్ కాదు.. జీరో స్టార్ అని చెప్పాడు.