దేశంలో కమల్‌హాసన్, అమితాబ్, నానాపాటేకర్, ఓంపురి, విక్రమ్, సూర్య వంటి విలక్షణ నటులు కొందరే ఉంటారు. వారు ఏ పాత్ర పోషించినా దానిలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను పోషించడం కాదు.. జీవించేస్తూ ఉంటారు. ఇలాంటి నటులు అన్ని భాషల్లో ఉన్నా టాలీవుడ్‌లో మాత్రం అరుదు. అందునా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టార్స్‌కి అది కత్తిమీదసామే అవుతుంది. ప్రయోగాలు ఎవరైనా చేస్తారు.. కానీ ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు. ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్‌లతో పాటు ‘భైరవద్వీపం’లో కురూపిగా బాలయ్య కనిపించి మెప్పించాడు. కానీ ఆయన వేసిన ముసలి పాత్ర ‘ఒక్కమగాడు’లో మెప్పించలేకపోయాడు. అదే పనిని అంతకు ముందు కమల్‌హాసన్ ‘భారతీయుడు’లో చేసి చూపాడు.
ఇక విషయానికి వస్తే పలు వైవిధ్యభరితమైన పాత్రల ద్వారా కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి తన స్థానం పదిలం చేసుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన ‘96’ చిత్రంలో ఆయన 40ఏళ్ల ప్రేమికుడి పాత్రను పోషించి మెప్పించాడు. దానికి మించిన ప్రయోగం తన తదుపరి చిత్రంలో ఆయన చేస్తున్నాడు. ఆయన నటించిన ‘సీతాకాత్తి’ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో ఆయన వయసు మళ్లిన కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న సినీ స్టార్‌గా కనిపించనున్నాడు. ఈయన రిటైర్‌మెంట్ ప్రకటించకుండానే చేస్తున్న చిత్రాలను కూడా ఆపేసే ‘అయ్యా’ అనే పాత్రలో కనిపిస్తున్నాడు.
ప్రేక్షకుల క్రేజ్, దర్శక నిర్మాతలు క్యూ కట్టినా, చివరకు సగం చిత్రాలను పూర్తి చేసుకున్న ఆయన చిత్రాల నిర్మాతలు నిర్మాతల సంఘాలకు, కోర్టుకి వెళ్లినా మౌనంగా ఉండే పాత్రను ఆయన చేస్తున్నాడు. మరి అలాంటి నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. దీంతో ఇది ఏదో కాస్త వాస్తవిక ఘటనల ఆధారంగా తీస్తున్న చిత్రమా? అనే చర్చ సాగుతోంది. మరి ఈ చిత్రం విడుదలైతే గానీ అసలు విషయం ఏమిటనే చిక్కు ప్రశ్న వీడదు.