చాలామంది ఫ్లాప్‌లలో ఉన్నప్పుడు తీవ్ర నిరుత్సాహానికి గురవుతారు. కానీ ఓటమి నేర్పే పాఠాలు ఎలా ఉంటాయి. కాస్త సమయం తీసుకుని ఎందుకు విఫలం అయ్యాం? జనాలకు ఎందుకు నచ్చలేదు? అనే విశ్లేషణలు, అనుభవాన్ని ఇచ్చేవి పరాజయాలే. అంతేగానీ వరుసగా పట్టిందల్లా బంగారం అయితే విమర్శలు, ఆత్మపరిశీలన చేసుకోకుండా తమ నిర్ణయాలకు తిరుగేలేదని భావిస్తాం. విజయాలు వచ్చినప్పుడు చుట్టూ ఉంటే వారు, వారి పొగడ్తల వల్ల అసలు నిజం కనుమరుగైపోతుంది. అందుకే రవితేజ నుంచి నాని వరకు అందరు ఎదురుదెబ్బలు తిన్నవారే. రవితేజకి వరుస పరాజయాలు, నానికి ‘కృష్ణార్జునయుద్దం, దేవదాస్’ ఫలితాల వల్ల అయినా కనువిప్పు కలిగే ఉంటుంది.
ఇక విషయానికి వస్తే తెలుగులో ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్‌గా విజయ్‌దేవరకొండని చెప్పుకోవాలి. కేవలం మూడేళ్లలో 100కోట్ల క్లబ్‌లో, విపరీతమైన క్రేజ్, మరీ ముఖ్యంగా యూత్‌కి ఐకాన్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’ విషయం పక్కనపెడితే తర్వాత వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ నుంచి ‘నోటా’ మినహా ‘టాక్సీవాలా’కి కూడా ఆయన క్రేజ్ రెట్టింపు అవుతూనే ఉంది. ఎంతో జాప్యంతో విడుదలైన ‘టాక్సీవాలా’ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి, ఇక అందరికీ కనకవర్షం కురిపిస్తోంది. అయితే ఇక్కడ విజయ్ గమనించాల్సిన విషయం మరోటి ఉంది. ‘అర్జున్‌రెడ్డి’ నుంచి ‘నోటా’ వరకు ఆయన నటనలో పెద్దగా వైరుధ్యం ఉండటం లేదు. ఎప్పుడు జులాయిగా, బాధ్యత లేని వాడిగా ఆయన నటన సాగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన కీలకనిర్ణయం తీసుకున్నాడు. విపరీతమైన క్రేజ్ వల్ల వరుస చిత్రాలు ఒప్పుకోవడం, కథలపై దృష్టి పెట్టకపోవడం, సినిమా అవుట్‌పుట్ ఎలా వస్తోంది? వంటి విషయాలలో నిర్లక్ష్యం వల్లే ‘నోటా’ డిజాస్టర్ గానీ, ‘టాక్సీవాలా’ ఆలస్యం జరగడం వంటివి జరిగాయని ఆయన తెలుసుకున్నాడు.
అందుకే ఇకపై అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటానంటున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘డియర్ కామ్రెడ్’కి సంబంధించి ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌ని చూసి ఆయన కొన్ని సీన్స్ రీషూట్‌కి ఆదేశించాడట. మరో విషయం ఏమింటే.. ప్రస్తుతం తెలుగుమీదనే దృష్టి పెట్టి ద్విభాషా చిత్రాలనో, లేక అన్ని భాషల్లో క్రేజ్ తెచ్చుకోవాలనో తాపత్రయపడటం కూడా మంచిది కాదనే చెప్పాలి. మొత్తానికి విజయ్ తన తప్పుని తొందరగా గుర్తించినందుకు ఆయనను అభినందించాలి.