సాధారణంగా స్టార్స్‌కి ఒకటి రెండు వరుస డిజాస్టర్స్ వస్తే అభిమానులే కాదు.. కొన్నవారు, చూసిన వారు... పరిశ్రమ.. ఇలా అందరు బాధపడటమే కాదు.. నిర్మాత నుంచి థియేటర్లలో సైకిల్ స్టాండ్ వారి వరకు అందరు నష్టపోతారు. అలాగని అది శాశ్వతం కాదు. నిజానికి ఎన్ని వరుస ఫ్లాప్‌లు వచ్చినా కూడా స్టార్ ఇమేజ్ ఉన్న వారికి మరలా ఒక్కటంటే ఒక్క హిట్ పడితే షరా మూమూలే. దీనికి ‘గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, రంగస్థలం’ వంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎంతో కాలం మేకప్ వేయని చిరుకి కూడా ఇది ఎంతో వర్తిస్తుంది.
ఇక విషయానికి వస్తే ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి నిజానికి ‘రోబో’ చిత్రం తర్వాత సరైన హిట్ లేదు. ‘కొచ్చాడయాన్, లింగ, కబాలి, కాలా’ వంటి పలు చిత్రాలు తమిళంతోపాటు తెలుగు బయ్యర్లలను, ప్రేక్షకులను కూడా బాగా నష్టపరిచి, చివరకు రోడ్లపైకి ఎక్కి నిరాహారదీక్షలు చేసే దాకా వెళ్లింది. కానీ ప్రస్తుతం ఆయన ‘2.ఓ’తో ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ నిన్నటిదాకా రజనీ చిత్రం తెలుగు హక్కులు కొనడానికి భయపడిన వారందరు ఇప్పుడు ఈ చిత్రం కోసం కోట్లు వెచ్చిస్తున్నారు. దీనిని తెలుగులో దిల్‌రాజు, ఎన్వీ ప్రసాద్, యూవి క్రియేషన్స్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. దీంతో ఈ చిత్రంపై తెలుగులో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ తెలుగు ప్రీరిలీజ్ రైట్స్ తెలుగు స్టార్స్‌కి సరిసమానంగా అమ్ముడుపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
‘2.ఓ’ కి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కలిపి రూ.72కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇంతకు ముందు కేవలం రాజమౌళి తీసిన ‘బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి-ది కన్‌క్లూజన్’, మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీనెంబర్ 150’, రామ్‌చరణ్ ‘రంగస్థలం’ మాత్రమే ప్రీరిలీజ్ బిజినెస్‌ని రూ.70కోట్లకు పైగా జరిగాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి ఈ క్రేజ్ రజనీని చూశా? లేక శంకర్‌పై నమ్మకమా? అనే విషయంలో పలు వాదనలు ఉన్నాయి. అయినా ‘రోబో’ తర్వాత ఒకటైన నికార్సయిన హిట్ రాకపోయినా ఈ చిత్రానికి ఈ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం మాత్రం అద్భుతమనే చెప్పాలి.