ఇంత వయసు పైబడినా కూడా సినిమా వెంటనే మరో సినిమాని లైన్‌లో పెడుతూ, వరుస చిత్రాలతో అత్యంత వేగంగా చిత్రాలను పూర్తిచేయడంలో బాలకృష్ణకి తన సమకాలీనులైన సీనియర్ స్టార్స్ మాత్రమే కాదు.. యంగ్ స్టార్స్ కూడా ఎవ్వరూ పోటీ రారనే చెప్పాలి. ఇక జయాపజయాలకు అతీతంగా సినిమాని ఓకే చెబితే తన పని తాను వేగంగా పూర్తి చేసుకుంటూ వెళ్లడంలో బాలయ్యకి సాటి మరెవ్వరూ ఉండరు. ఓవైపు తెలుగుదేశంలో కీలకనాయకునిగా, హిందూపురం ఎమ్మెల్యేగా, స్టార్‌గా ఆయన వేగం అనితరసాధ్యం. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఆ రాష్ట్రంలో నిలబడిన తెలుగుదేశం పార్టీ అభ్యర్దుల తరపున ప్రచారం చేస్తాడని బాగా ప్రచారం జరిగింది.
కానీ తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ ఎన్నికలలో ప్రచారం చేయడం లేదని తెలుస్తోంది. వీలైతే హరికృష్ణ తనయురాలు నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న కూకట్‌పల్లి నియోజకవర్గంలో మాత్రమే ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. బాలయ్య ఎన్నికల ప్రచారం చేస్తే ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తున్న తన తండ్రి ‘ఎన్టీఆర్’ బయోపిక్ విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని కూడా వార్తలు వచ్చాయి. కానీ వాటికి ఇప్పుడు తెరపడింది.
ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించిన షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం షెడ్యూల్స్ మొదలవుతున్నాయి. ముఖ్యపాత్రధారులు షూటింగ్ జాయిన్ అయిపోతూ ఉండటం, వారి వారి లుక్‌లకి సంబంధించిన పోస్టర్లు విడుదల అవుతూ ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రంపై ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతోంది. కాగా ఎన్టీఆర్ బయోపిక్‌లోని మొదటి పార్ట్ కథానాయకుడుని జనవరిలో సంక్రాంతి కానుకగా 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఆదిశగా పనులను వేగవంతం చేశారు. దీనిలో భాగంగా ఈ చిత్రం ఆడియో వేడుకకు సంబంధించి కూడా దర్శకనిర్మాతలు ఇప్పటికే ప్లాన్ చేశారని తెలుస్తోంది. డిసెంబర్ 16వ తేదీన తిరుపతిలో ఈ చిత్రం ఆడియో వేడుకను జరుపనున్నారట.
గతంలో బాలకృష్ణ-క్రిష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన బాలయ్య వందో చిత్రం ‘గౌతమిపుత్రశాతకర్ణి’ ఆడియోను కూడా తిరుపతిలోనే విడుదల చేసిన సంగతి తెలిసిందే. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. కీరవాణి స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్‌లో ఈ మూవీకి కీరవాణి ట్యూన్స్ ఇచ్చాడని అంటున్నారు. ఈ చిత్రంలో రానా, సుమంత్ వంటి వారితో పాటు రకుల్, తమన్నా, నిత్యామీనన్ వంటి వారు కూడా ఉండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.