గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉండేదో అందరికి తెలిసిన విషయమే. ఇక శంకర్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ నటిస్తున్నాడు అంటే.. ఆ సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుంది. తాజాగా శంకర్ - రజిని కాంబోలో తెరకెక్కిన 2.ఓ మరో వారం రోజుల్లో అంటే వచ్చే గురువారమే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మొదలైనప్పుడు ఉన్న క్రేజ్, హైప్ ఇప్పుడు విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో లేదంటున్నారు? ఒకవేళ ఉంటే రోబో 2.ఓ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో అనేది సోషల్ మీడియాలోనే ఇంకేదన్న విధంగానో.. వారి ఫీలింగ్స్‌ని షేర్ చేసుకునేవారు. కానీ 2.ఓ విషయంలో అది పెద్దగా కనబడడం లేదు.
ఈ సినిమా ట్రైలర్‌తోనే సంచలనాలు నమోదు చేస్తుంది అంటే... బాహుబలి రేంజ్ సంచలనాలు నమోదు కాలేదు. మరి 600 కోట్ల భారీ నుండి బహు భారీగా ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పుడున్న హైప్ మాత్రం సరిపోదు. మరేదో ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని దుబాయ్ లోనూ, ట్రైలర్ లాంచ్ ని చెన్నైలోనూ ఘనంగా జరిపించిన లైకా వారు ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో వెనక్కి తగ్గుతున్నారా.. లేదంటే దానికదే క్రేజ్ వచ్చేస్తుందిలే మనమెందుకు... ఈ సినిమాని ప్రమోట్ చేయాలి అని అనుకున్నారా... ఏదైనా ప్రస్తుతం సినీ ప్రియుల్లో 2.ఓ మీద ఓ.. అన్నంత అంచనాలు అయితే కలగడం లేదు. హాలీవుడ్ రేంజ్ లో శంకర్ 2.ఓ ని తీర్చిదిద్దినా కానీ.. సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడడంతో హైప్ తగ్గిందో.. లేదంటే ప్రమోషన్స్ లో లోపమో అర్ధం కావడం లేదు.
కానీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి ఈ మాత్రం హైప్ సరిపోదు. మరి ఈ సినిమా మీద ప్రస్తుతం ఉన్న హైప్‌ని మరింతగా పెంచాల్సిన అవసరం అటు శంకర్, ఇటు రజిని, నిర్మాతలపై ఎంతైనా ఉంది. ఏదో కౌంట్‌డౌన్ పోస్టర్స్ తోనే సినిమాకి హైప్ అయితే వచ్చి పడదు. అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ఇలా భారీ తారాగణం నటించిన ఈ సినిమా భారీ హిట్ కొట్టాలి అంటే సినిమా మొదటి షోకే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వాలి. టాక్ లో ఏమాత్రం తేడా వచ్చినా.. మాత్రం నిర్మాతల పని అవుట్.