మనదేశంలో ఓటర్ల నమోదు ప్రక్రియకు జరిగే తతంగం అంతా ఇంతా కాదు. ప్రతిసారి దీనికోసం వందల కోట్లు ఖర్చు చేస్తుంటారు. కానీ బతికున్న వారిని మరణించినట్లుగా, మరణించిన వారిని బతికున్నట్లుగా, కిందటి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారి పేర్లు లిస్ట్‌లో లేకుండా పోవడం, ఒకే వ్యక్తి పేరుపై అనేక నమోదులు ఉండటం.. ఇలాంటి చిత్ర విచిత్రాలెన్నో. ఆధార్‌కార్డ్‌లాగే ఓటర్‌లిస్ట్‌లకు కూడా సరైన ప్రణాళిక రచించలేకపోవడం అధికారుల అలసత్వానికే కాదు.. రాజకీయ నాయకులు వ్యూహాలకు కూడా ఇవి బలైపోతున్నాయి. తమకు ఓటు వేయని వారి పేర్లను లిస్ట్ నుంచి తొలగించడం, ప్రతిసారి ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు నమోదు చేసుకోండి అని హడావుడి చేయడం, తమ ప్రత్యర్ధులకు ఓటు వేసే వారిని అధికారంలోని పార్టీ నాయకులు ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించడం, దాని కోసం రోజుల సమయం వృధా ఎందుకని ఓటర్లు మౌనంగా ఉండటం వంటివి చూస్తే మన దేశం అభివృద్ది చెందుతున్న దేశం కాదు.. పూర్తిగా వెనుకబడిన దేశమని ఒప్పుకోవాల్సివుంటుంది.
టెక్నాలజీ, హైటెక్, క్యాష్ లెస్.. ఇలా సూక్తులు చెప్పే నాయకులకు ఈ తప్పొప్పులు మాత్రం కనిపించవు. దాని కోసం వేలకోట్ల ప్రజాధనం, విలువైన కాలం, ఉద్యోగం చేసుకోవాల్సిన ఉద్యోగులను దీనికి నియమించడం వంటివి మన ప్రజాస్వామ్యంలోని నేతిబీరకాయ చందాన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటాయి. ఇక ఈవీఎంల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విదేశాల నుంచి అన్నింటిని అరువు తెచ్చుకునే మనం ఎన్నికల ప్రక్రియలో ఇతర దేశాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం మాత్రం జరగదు. ఎందుకంటే ఎవరి రాజకీయాలు వారికి ముఖ్యం. ఇక విషయానికి వస్తే ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
సుహాసిని ఓటర్ ఐడీ కార్డులో అధికారులు పెద్ద తప్పు చేశారు. ఇటీవలే ఆమె నాంపల్లి నియోజకవర్గం నుంచి తన పేరును ఓటర్ల లిస్ట్‌లో నమోదు చేసుకుంది. ఓటర్ కార్డులో ఆమె భర్త చుండ్రు వెంకట శ్రీకాంత్ పేరు ఉండాల్సిన చోట ఆమె తండ్రి, ఇటీవలే హఠాన్మరణం పాలైన నందమూరి హరికృష్ణ పేరు ఉండటం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని చూపుతోంది. కాగా ఓటర్ ఐడీ కార్డులో సుహాసిని తన భర్త ఇంటి పేరు బదులు తన నందమూరి ఇంటిపేరునే ఉంచుకుంది. నాంపల్లి సెగ్మెంట్ ఓటర్ల లిస్ట్ జాబితాలో పార్ట్ నెం 48లో సీరియల్ నెంబర్ 710గా ఆమె పేరు రిజిష్టర్ అయి ఉంది. ఓటరు కార్డులలో ఇలాంటి తప్పులు సహజమేనని, దానిని ఆధారంగా చేసుకుని నామినేషన్‌ని తిరస్కరించలేమని రిటర్నింగ్ అధికారి మమత చెప్పడం మరో బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా చెప్పుకోవాలి.