పవన్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పూటకో మాట మాట్లాడుతున్నాడు. మొదట్లో కేవలం ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చానని, తానేమీ సీఎం కుమారుడినికాదని, సీఎం కావాలనే కోరిక లేదని, కేవలం అధికారంలోకి వచ్చే పార్టీల అవినీతిని, తప్పులను ఎత్తి చూపడమే తన ధ్యేయమని ప్రకటించాడు. ఆ తర్వాత తాను ఆరేడు సీట్లే గెలవవచ్చు గానీ అంత మందితోనే తాను అన్ని సమస్యలపై పోరాడుతానని మాట ఇస్తున్నట్లు చెప్పాడు. కొంత కాలం తర్వాత తెలుగుదేశం కోట్లకు కోట్లు ఎన్నికల్లో గెలవాలని ఖర్చుపెడుతోంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా టిడిపిని అధికారంలోకి రానివ్వను అని చెబుతూనే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నిర్ణయాత్మకశక్తిగా మారుతుందని, కర్ణాటకలో అంత తక్కువ సీట్లు సంపాదించిన జెడియస్, కుమారస్వామి ముఖ్యమంత్రి కావడమే దానికి ఉదాహరణ అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. కానీ ఆ తర్వాత 2019లో కాబోయే సీఎంను నేనే. పూర్తి మెజార్టీతో గెలస్తామని అన్నాడు.
టిడిపిని అధికారంలోకి రానివ్వనని దానికోసం తాను కీలకంగా మారుతానని చెబుతూ తాను టిడిపికి మద్దతు ఇవ్వనని చెప్పడం ద్వారా వైసీపీకి మద్దతు ఇస్తాననే విధంగా మాట్లాడాడు. ప్రత్యేకహోదా విషయంలో బిజెపిని పెద్దగా విమర్శించకుండా పాచిపోయిన లడ్డులు అని చెప్పిన ఆయనే ప్రత్యేకహోదా ఉద్యమాన్ని వైజాగ్‌లో జరిపేందుకు పిలుపునిచ్చి, తన మాట విని వచ్చిన అభిమానులు పోలీసులతో లాఠీ చార్జీ దెబ్బలు తింటే.. తీరిగ్గా మరుసటి రోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టాడు. బిజెపి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే తానే దేశమంతా తిరిగి అన్ని పార్టీల మద్దతు కూడగడుతానని ప్రకటించి ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, ఏపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కల కోసం ఉండవల్లి వంటి వారితో నిజనిర్ధారణ కమిటీ వేశాడు. కేంద్రమే అబద్దం చెబుతోందని చెప్పినా, ఆ తర్వాత మౌనం వహించాడు.
ఇక తాజాగా ఆయన తన పార్టీని తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా బలోపేతం చేయడానికి చెన్నై వెళ్లాడు. అక్కడ కాబోయే సీఎంని నేనే అని చెప్పాడు. కానీ ఎలా? ఎన్ని సీట్లు గెలుస్తాము? అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోయాడు. ఇక 2003లోనే రాజకీయాలలోకి రావాలని అనుకున్నానని, తర్వాత కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ని స్థాపించి రెండేళ్లు సేవ చేశానని, తర్వాత తన అన్నయ్య ప్రజారాజ్యం పార్టీలోని యువరాజ్యంకి విభాగానికి నాయకత్వం వహించానని చెప్పాడు. మరి ఆయన కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా ఏమి చేశాడో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. అదే సమయంలో చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని, ఆయన ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటాడో ఎప్పుడు ఎవరిని కిందకి తోస్తాడో తెలియదని వ్యాఖ్యానించాడు. మరోవైపు జగన్.. మోదీ గురించి మాట్లాడటం లేదని, మాట్లాడితే ఆయన అవినీతి బయటకు వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆయన మౌనంగా ఉంటున్నాడని చెప్పాడు. అంతా బాగుంది కానీ సొంతగా ఆయన ఎలా సీఎం అవుతాడు? అనే దానిపై మాత్రం విస్తృత చర్చ సాగుతోంది.