బాలనటునిగా ‘బాలగోపాలుడు’ చిత్రంతో పరిచయం అయి, ఆ తర్వాత ‘తొలిచూపులోనే’ చిత్రంతో హీరోగా మారాడు నందమూరి కళ్యాణ్‌రామ్. ఆ తర్వాత ఆయన నటించిన ‘అభిమన్యు, అసాధ్యుడు, విజయదశమి, లక్ష్మీకళ్యాణం, జయీభవ, కళ్యాణ్‌రామ్ కత్తి, హరేరామ్, ఓం 3, షేర్, ఇజం, ఎమ్మెల్యే, నానువ్వే’ వంటి చిత్రాలన్నీ పరాజయం పాలయ్యాయి. ఇతను నటించిన చిత్రాలలో సురేందర్‌రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ తీసిన ‘అతనొక్కడే’, ఆ తర్వాత ‘పటాస్’ మూవీలు మాత్రమే బాగా ఆడాయి. ఆయన నటించిన పలు చిత్రాలకు ఆయనే నిర్మాత కావడంతో.. ఆర్ధికంగా కూడా బాగా నష్టపోయాడు కళ్యాణ్ రామ్.
ఇక రవితేజ-సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘కిక్ 2’ చిత్రం నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్యకు అండగా నిలిచి ‘జైలవకుశ’ చిత్రం చేసి ఇచ్చాడు. ఈ చిత్రం మంచి లాభాల పంట పండించింది. అయినా ఈయన హీరోగా మాత్రం పెద్దగా పేరు తెచ్చుకోలేకపోతున్నాడు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటైన ‘జనతాగ్యారేజీ’ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేతలతో ఎన్టీఆర్‌కి మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో ఎన్టీఆర్ చొరవ తీసుకుని మైత్రి మూవీ మేకర్స్ బేనర్‌లో కళ్యాణ్‌రామ్ హీరోగా ఓ చిత్రం చేయాలని వారిని రిక్వెస్ట్ చేయడం, దానికి వారు ఓకే అనడం జరిగిపోయాయంటున్నారు.
ఇప్పటికే ఓ కొత్త దర్శకుని కథతో కళ్యాణ్‌రామ్‌ని ఒప్పించి చిత్రాన్ని పట్టాలెక్కించడానికి సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ విషయానికి వస్తే స్టార్ హీరోలతో తప్పించి, మామూలు హీరోలతో వారు నిర్మించిన ‘సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రాలు పెద్దగా ఆడలేదు. మరి కళ్యాణ్‌రామ్‌తో వారు చేయబోయే చిత్రం ఏమైనా కళ్యాణ్‌రామ్‌కి హీరోగా హెల్ప్ అవుతుందేమో వేచిచూడాల్సివుంది...!