‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి దగ్గరైన విజయ్ దేవరకొండకు జనాల పల్స్ ఏంటో అప్పుడే అర్ధం అయిపోయింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఆడియో లాంచ్ అప్పుడు విజయ్ స్పీచ్ యూత్ ని మరింత యాట్రాక్ట్ చేసింది. దానికి తోడు సినిమా సూపర్ హిట్ కావడంతో విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్టయింది. ‘అర్జున్ రెడ్డ్’ నుండి విజయ్ తన ప్రతి సినిమా ప్రమోషన్స్ విషయంలో దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు.
ఇక ఆడియో ఫంక్షన్లలో అయితే మనోడు చెలరేగిపోతాడు. కుర్రాళ్లకు కిక్కిచ్చే మాటలతో అదరగొట్టేస్తాడు. ‘గీత గోవిందం’ సినిమాతో మరో సక్సెస్ ని అందుకున్న విజయ్‌ని చూస్తే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు భయపడిపోతున్నారు. దాంతో మనోడి సినిమా వస్తుందంటే ఆ డేట్స్ చూసుకుని మరి తమ సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్నారు కొందరు హీరోలు.
ఆ తరువాత వచ్చిన ‘నోటా’ సినిమా డిజాస్టర్ అయినా విజయ్ క్రేజ్ ఏమీ తగ్గలేదు. రెండు రోజులు కిందట రిలీజ్ అయిన ‘టాక్సీవాలా’కి హిట్ టాక్ రావడంతో విజయ్ క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయం. ‘నోటా’ రిలీజ్ రోజునే అంటే అక్టోబర్ 5న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటొని’ కూడా రిలీజ్ కావాల్సివుంది. కానీ అప్పట్లో విజయ్ క్రేజ్ చూసి రవితేజ నవంబర్ 16కి డేట్ మార్చుకున్నాడు. అయినా కానీ పోటీ తప్పలేదు. ఆ తరువాత రోజు అంటే శనివారం విజయ్ ‘టాక్సీవాలా’తో వచ్చి హిట్ కొట్టాడు. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. ఈ సినిమాతో విజయ్ స్టార్‌డమ్ మరింతగా పెరిగింది. ఇకపై విజయ్ సినిమాలు వస్తుంటే.. మిగతా హీరోలు కాస్త చూసి వారి సినిమాలు విడుదల చేసుకోవడం ఖాయం అనేలా క్రేజ్ సంపాదించుకున్నాడీ రౌడి.