కుటుంబ కథా చిత్రాలతో జగ్గూభాయ్ అదే జగపతిబాబు హీరోగా తనకంటూ ఓ స్థాయిని, గుర్తింపుని పొందారు. శోభన్‌బాబు, జగపతిబాబు, వెంకటేష్ వంటి పేర్లు చెప్పగానే.. వారి వెనుక కనిపించేది కుటుంబ కథా నేపథ్యాలే. అలాంటి జగపతిబాబుకి హీరోగా టైమ్ కలిసి రాకపోవడంతో.. కొన్నాళ్లు సినిమాలేవీ చేయకుండా ఒంటిరిగా కాలం గడిపేశారు. ఆ తర్వాత బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన ‘లెజెండ్’ చిత్రం జగపతిబాబు ఫేట్‌నే మార్చేసింది. ఇప్పుడు తెలుగులో తిరుగులేని విలన్ ఎవరయ్యా అంటే.. అందరూ జగపతిబాబు పేరే చెబుతారు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన ‘బసిరెడ్డి’ పాత్ర, అంతకుముందు ‘రంగస్థలం’లోని ‘ప్రెసిడెంట్ ఫణింద్రభూపతి‘ పాత్ర జగపతిబాబు నటనకు తార్కాణాలు.
ఇక జగపతిబాబు ప్రస్తుతం మరో చారిత్రాత్మక చిత్రమైన ‘సైరా నరసింహారెడ్డి’లో చాలా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌పై జగపతిబాబు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ నటుడే కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. అయితే జగపతిబాబు అంది.. నెగిటివ్ మీనింగ్‌లో అయితే కాదు. రామ్ చరణ్ కేవలం నటుడే కాదు మంచి నిర్మాత అంటూ జగపతిబాబు.. చరణ్‌పై ప్రశంసలు కురిపించాడు.
ఆయన చరణ్ గురించి చెబుతూ.. ‘‘రీసెంట్‌గా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంబంధించిన కొన్ని భారీ సన్నివేశాలను ‘జార్జియా’లో చిత్రీకరించారు. వేలాది మంది ఆర్టిస్టులు షూటింగులో పాల్గొన్నారు. చిన్న, పెద్ద నటీనటులు అనే భేదం లేకుండా ఒక నిర్మాతగా చరణ్ అందరినీ ఎంతో మంచిగా చూసుకున్నారు. అంతేకాదు టైమ్‌కి ఫుడ్, హెల్త్ వంటి విషయాలలో కూడా ఎంతో శ్రద్ధను తీసుకున్నాడు. నిర్మాతకు ఉండాల్సిన మంచి లక్షణం చరణ్‌లో ఉంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి సౌకర్యాలను కల్పించారు. షూటింగు జరిగే రోజుల్లో ఆర్టిస్టులకు ఎదురయ్యే ఇబ్బందులను ఆయన చక్కగా పరిష్కరించేవారు. నాకు తెలిసి రామ్ చరణ్ మంచి నటుడే కాదు .. అంతకు మించి మంచి మనసున్న నిర్మాత కూడా. నిర్మాత అంటే ఇలా ఉండాలనిపించేలా ఓ గొప్ప నిర్మాత నాకు చరణ్‌లో కనిపించాడు..’’ అని చరణ్‌ని పొగిడేశాడు జగ్గూభాయ్.