రవిబాబు.. చలపతిరావు తనయునిగా, నటునిగా, దర్శకరచయితగా ఆయన తన సత్తా చాటుతూనే ఉన్నాడు. విలన్‌గా, కామెడీ ఆర్టిస్ట్‌గా, కామిక్ విలన్‌గా ఆయన తనదైన శైలిని ఏర్పరచుకున్నాడు. ‘అల్లరి’ చిత్రంతో దర్శకనిర్మాతగా మారిన ఈయన ఆ తర్వాత జయాపజయాలకు అతీతంగా మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ‘అల్లరి, అమ్మాయిలు-అబ్బాయిలు, పార్టీ, సోగ్గాడు, అనసూయ, నచ్చావులే, అమరావతి, మనసారా, నువ్విలా, అవును, లడ్డూబాబు, అనసూయ2’ చిత్రాలను తీసిన ఆయన తన 13వ చిత్రంగా పందిపిల్ల ప్రధానపాత్రలో ‘అదుగో’ చిత్రాన్ని తీశాడు. ఈయన తీసిన పలు చిత్రాలను ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు, డి.సురేష్‌బాబులు నిర్మించి, ఆయనంటే తమకున్న గౌరవాన్ని చూపించారు.
ఇక కొత్తదనం,కొత్తతరం కోసం సినిమాలు తీయడంలో ఆయన ముందుంటాడు. ప్రస్తుతం ఆయన తీసిన ‘అదుగో’ చిత్రం విడుదలైంది. ఇక చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రవిబాబు పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. సినిమాలలో ఏడుపును, యాక్షన్‌ని, భయపెట్టే చిత్రాలను ఆస్వాదించే పలు రకాల ప్రేక్షకులు ఉంటారు. అందులో ఎక్కువగా అందరూ హాస్యాన్ని ఇష్టపడతారు. నేను నా అభిరుచి ప్రకారం సినిమాలు తీసి మీరు చూడండి అంటే చూడరు. అందుకే ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన చిత్రాలు అందిస్తూ ఉంటాను. నేనే దర్శకుడిని, నిర్మాతను, క్యాషియర్‌ని కాబట్టి.. నా పై ఇంకా పెద్ద బాధ్యత ఉంది. ప్రచార రంగం నుంచి వచ్చిన వాడిని. గోడమీద పది పోస్టర్లు కనిపిస్తే మనకి బాగా ఆసక్తిని కలిగించే పోస్టర్ మీదకే మన దృష్టి వెళ్తుంది. ఆ ఆలోచనతోనే అలాంటి పోస్టర్లను తయారు చేస్తూ ఉంటాను. నోట్ల రద్దు సమయంలో నేను బంటీ పందిపిల్లను ఎత్తుకుని ఏటీఎం వద్ద క్యూలో నిల్చున్నాను. వెంటనే సాయంత్రం బిబిసి వారు నాకు ఫోన్ చేశారు. ఏ చిత్రానికైనా ప్రమోషన్ ముఖ్యమని నేను బాగా నమ్ముతాను. చేసిన సినిమాలను మరలా చేయాలని అనుకోను. ప్రతిసారి కొత్త టాపిక్ కోసం వెతుక్కుంటూ ఉంటాను. దాని వల్ల ప్లస్, మైనస్‌లు రెండు ఉంటాయి.
ఎప్పుడు కొత్త కంటెంట్‌తో వస్తాడనే ప్రేక్షకుల నమ్మకం ప్లస్ అయితే, ప్రతి సినిమాకి నా తొలిసినిమాలాగానే కష్టపడాల్సిరావడం మైనస్. ఏ సినిమా చేస్తూన్నా నాకు ఒకే రకమైన ఒత్తిడి, టెన్షన్, కష్టం ఉంటాయి. కొత్తగా ఆలోచించకపోతే నాకు నిద్ర పట్టదు. ఏ పనినైనా సృజనాత్మకంగా చేయాలనేది నా తపన. ఇలా చేయడంతో జీవితంలో ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు. దర్శకునిగా ప్రతి రోజుని ఆస్వాదిస్తూ ఉంటాను. నా ప్రయాణంలో ప్రతిరోజు సవాలే. వాటిని అధిగమిస్తున్న కొద్ది ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని కథ అనుకోవడం ఉండదు. ఒక మంచి ఐడియా కోసం అన్వేషిస్తా. అది వచ్చిన వెంటనే దానికి తగ్గ తారాగణంతో సినిమాలు చేస్తూ ఉంటాను. అగ్రహీరోలతో సినిమాలు చేయాలనిపిస్తే వారిని సంప్రదిస్తాను. నాకు నటనంటే కూడా చాలా ఇష్టం. ఈ రెండేళ్లు ‘అదుగో’ వల్ల అవకాశాలు వచ్చినా నటించలేదు. ఈ సినిమా అయిపోవడంతో ఇక ఏ మంచి పాత్ర వచ్చినా వదులుకోకుండా నటించాలని అనుకుంటున్నాను..’ అని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా విడుదలైన ఈ చిత్రం విమర్శకులనే కాకుండా, ప్రేక్షకులను మెప్పించలేకపోతుందనే టాక్ బాక్సాఫీస్ వద్ద నడుస్తోంది. రవిబాబు సినిమాలు ముందు అంత తొందరగా ఎక్కవు.. టాక్ బాగుంటేనే సినిమాకు మంచిపేరు వస్తుంది. మరి ఈ సినిమాకి మొదటి రోజు టాకే చాలా తేడాగా ఉండటంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా నిలబడుతుందనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది.