అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం మెగా అభిమానుల నిరీక్షణ మాములుగా లేదు. నా పేరు సూర్య విడుదలై నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇంకా కొత్త సినిమా ప్రకటించకుండా తప్పించుకుంటున్న అల్లు అర్జున్ పై మెగా అభిమానులు గుర్రుగానే ఉన్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అని ప్రచారం జరిగినప్పుడు... వినాయకచవితికి మెగా ఫాన్స్ కి చవితి శుభాకాంక్షలు తెలిపి మరి... నా సినిమా మొదలవడానికి కొద్దిగా టైం పడుతుంది.. అప్పటివరకు ఓపిక పట్టండని చెప్పాడు. ఇక తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అన్నారు.
ఇక ఈ రోజు దీవాళి సందర్భంగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా పై ప్రకటన వస్తుంది అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇక మెగా అభిమానులు నిన్న రామ్ చరణ్ వినయ విధేయరామ లుక్ అండ్ టైటిల్ తో పండగ చేసుకుంటే.. ఈ రోజు అల్లు అర్జున్ న్యూస్ మూవీ ఎనౌన్సమెంట్ తో పండగ చేసుకుందామనుకుని ఎదురు చూస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తాయితీగా... భార్య స్నేహ, కొడుకు అయాన్, కూతురు అర్హ తో కలిసి అందమైన ఫోటో దిగి మెగా ఫాన్స్ కి దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు. అంతేనా.. నా చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. మరి కొన్ని రోజుల్లో నా కొత్త చిత్ర వివరాలను తెలియజేస్తానని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
మరి సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగా ఈ రోజు అల్లు అర్జున్ న్యూ మూవీ ఎనౌన్స్‌మెంట్ అయితే లేదని స్వయానా అల్లు అర్జున్ చెప్పాడు. ఇక మెగా అభిమానులు అల్లు అర్జున్ సినిమా కోసం మరికొంతకాలం వేచి చూడడం తప్పేలా లేదు.