తమిళంతో పాటు తెలుగులో కూడా క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్స్ ఎందరో ఉన్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్, విక్రమ్, సూర్య, కార్తి, విశాల్, శరత్‌కుమార్ నుంచి ఎందరో ఈ కోవలోకి వస్తారు. ఇక తన సోదరుడు సూర్యతో సమానమైన ఇమేజ్‌ని తెలుగులో కలిగిన యంగ్‌స్టార్ కార్తి. ఇటీవల ఆయన ‘ఖాకీ’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం డీసెంట్ విజయాన్ని సాధించింది. ఇందులో కార్తికి జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటించడం విశేషం. కాగా ప్రస్తుతం ఇదే హిట్ పెయిర్ ‘దేవ్’ అనే చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ఈ మూవీలో ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ వంటి తెలుగులో అద్బుతమైన ఫాలోయింగ్ ఉన్న ఆర్టిస్టులు నటిస్తున్నారు. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి హరీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో ‘దేవ్’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభించింది. ఇక దీపావళి కానుకగా ఈమూవీ టీజర్‌ని విడుదల చేశారు. లవ్, రొమాన్స్, యాక్షన్ సీన్స్‌తో కట్ చేసిన ఈ టీజర్ కూడా బాగా ఉంది. ‘ఈలోకంలో బతకడానికి ఎన్నో దారులున్నాయి. ఎవరో చెప్పారని అర్ధం కాని చదువు చదివి, ఇష్టం లేని ఉద్యోగం చేసి, ముక్కు మొహం తెలియని నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పనిచేసి, ఈగో, ప్రెషర్, కాంపిటీషన్‌లో ఇరుక్కుని, అంటీ అంటనట్లు లవ్ చేసి, ఏం జరుగుతుందో అర్ధం కాకుండా బతకడం ఓ దారి.. ఇది కాకుండా బతకడానికి మరో దారి కూడా ఉంది..’ అంటూ కార్తి చెప్పిన డైలాగ్స్ యూత్‌ని టార్గెట్ చేస్తూ సాగడంతో దీనికి మంచి స్పందన లభిస్తోంది.
చివరలో ‘నన్ను వదిలేస్తే అమ్మాయిని తీసుకుని పోతూ ఉంటా..’ అంటూ కార్తీ వాయిస్‌ఓవర్‌తో పాటు ఆయన చెప్పిన డైలాగ్ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. టీజర్‌లో ఇంతకు ముందు కంటే కార్తీ ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. మరి ‘దేవ్’ ద్వారా కార్తీ తెలుగులో ఎలాంటి హిట్ కొడతాడో వేచిచూడాల్సివుంది. యూత్‌లో తనకున్న క్రేజ్‌కి అనుగుణంగా కార్తీ యువతనే టార్గెట్ చేస్తున్నాడనే విషయం మాత్రం స్పష్టంగా అర్దమవుతోంది.