మనదేశంలో పోలింగ్‌శాతం ఎంత రిగ్గింగ్‌లు జరిగినా 50శాతానికి కూడా మించడం లేదు. అందునా విద్యావంతులే ఈ ఎన్నికల మీద నమ్మకం కోల్పోయి ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. పోలింగ్ శాతం ఆ మాత్రం అయినా ఉన్నదంటే అది గ్రామీణులు, అక్షరాస్యత లేనివారు, మహిళలే కావడం విశేషం. లక్షల మంది చేసే చెడుకన్నా.. మేధావి మౌనమే దేశానికి చేటని ఎందరో చెబుతున్నారు. అందుకే ఈ మద్య కొందరు నిర్బంధ ఓటు హక్కు కావాలని అంటున్నారు. అయితే పోలింగ్ శాతం సగానికి సగం లేకుండా పోయి, ఒక్క ఓటు పక్క వాడికి ఎక్కువ వచ్చినా అదే గెలుపు అని చెప్పడం మన ప్రజాస్వామ్యంలోని నేతిబీరకాయలోని నెయ్యి చందంగా మారింది. ఏ అభ్యర్ధికైనా మొత్తం పోలయిన ఓట్లలో 50శాతం పైగా రావాలని, అలాగే నచ్చని ప్రజాప్రతినిధులను రీకాల్ చేయాలనే ఆలోచనలు కూడా మొలకెత్తుతున్నాయి.
ఇక నోటా పెట్టినా కూడా అంత కష్టపడి వెళ్లి నోటాకి ఓటు వేసే బదులు, అసలు ఓటు వేయకుండా ఉండటం బెటర్ అని మరికొందరు ఆలోచిస్తున్నారు. ప్రతి వ్యక్తి అవినీతిపరుడు, ప్రతి పార్టీ అదే తానులో ముక్క అయితే ఓట్లను బహిష్కరించడం మినహా మరో మార్గంలేదనేది మరికొందర వాదన. ఒక కూలీ పని చేసుకునే వ్యక్తి రోజంతా ఓటు కోసం వృదా చేసుకుంటే ఆరోజుకి వారికి గడిచేదెలా? ఇలా దీనిపై ఎన్నో వాద వివాదాలు ఉన్నాయి. ఇక ఓటు వేయించుకుని గెలిచిన వ్యక్తి తాము ఏ పార్టీని చూసి ఓటేశామో.. చివరి వరకు అదే పార్టీలో ఉంటాడనే నమ్మకం లేదు.
ఇక ఓటుకి ఉన్న విలువను గురించి తాజాగా మురుగదాస్-విజయ్‌ల ‘సర్కార్’ చిత్రంలో చూపించారట. మరి ఈ విషయాన్ని దర్శకుడు ఎలా తెరపై చూపిస్తాడో వేచి చూడాలి. ఇక ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలవుతోంది. అందుకోసం సహజంగా రానీ డబ్బింగ్ పాటల, సంభాషణల రచయితలను కాకుండా చంద్రబోస్ చేత ఓటు విలువను తెలిపేలా ఓ అద్భుతమైన ప్రేరణనిచ్చే పాటను నిర్మాతలు రాయించారు. ఈ పాట ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ సోషల్‌మీడియాలో బాగా హల్‌చల్‌చేస్తోంది. ఈ పాటను రాసిన చంద్రబోస్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నా భార్యతో సహా ఓటు హక్కును వినియోగించుకుంటాను. ఓటు వేసిన తర్వాతే ఇతర విషయాలను చూసుకుంటాను. ప్రస్తుతం మణికొండలో ఉంటున్నాను. ఈసారి ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకుంటానని చెప్పిన చంద్రబోస్ తాను ‘సర్కార్’ చిత్రం కోసం రాసిన ఉత్తేజ గీతాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు.