మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాహీరో సాయిధరమ్‌తేజ్. ఈయన మొదటి చిత్రం 'రేయ్' కంటే రెండో చిత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం' విదుదలై హిట్ సాధించింది. నాడు చిరంజీవి కూడా తన కెరీర్ కూడా ఇలా మొదటి చిత్రం కంటే రెండో చిత్రంతో మొదలైన విషయాన్ని సెంటిమెంట్‌గా చెప్పి సాయి మంచి స్టార్ అవుతాడని జ్యోతిష్యం చెప్పాడు. ఇక తన మామయ్యల మేనరిజమ్స్, రీమిక్స్‌లు ఇలా వారి తరహా నటనతో ఆయన చేసిన 'సుప్రీం, సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్' చిత్రాలు కూడా బాగా విజయం సాధించి, మాస్ హీరోగా ఆయనను 25కోట్ల మార్కెట్ రేంజ్‌కి తీసుకెళ్లాయి.
కానీ 'తిక్క' చిత్రంతో అసలు కథ మొదలైంది. 'తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్.. ఐ లవ్ యు' చిత్రాలు భారీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. వినాయక్, కరుణాకరన్ వంటి వారు కూడా ఆయనకు విజయాన్ని అందించలేకపోయారు. ఇక తాజాగా ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' చిత్రం చేయనున్నాడు. ఈ మూవీ నాని నుంచి సాయికి వచ్చింది. దీనితో తమ సత్తాను నిరూపించుకోవాల్సిన క్లిష్ట పరిస్థితులు తేజు, కిషోర్ తిరుమలకి ఏర్పడ్డాయి. ఇక నాటి దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నాడు దూరదర్శన్‌లో వచ్చిన పాటల కార్యక్రమం 'చిత్రలహరి' బాగా పరిచయమైన పదమే.
కాగా ఈ మూవీలో సాయి పక్కన నటించే ఇద్దరు హీరోయిన్ల పేర్లు 'చిత్ర-లహరి'. మొదటి హీరోయిన్‌గా చిత్ర పాత్రకు 'హలో' ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్‌ని ఎంపిక చేశారు. 'లహరి' పాత్రకు గాను 'మెంటల్ మదిలో' ఫేమ్ నివేదాపేతురాజ్‌ని ఫైనల్ చేశారు. తాజాగా డివైడ్ టాక్ తెచ్చుకున్న మైత్రిమూవీమేకర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.