ఈమధ్యన క్రూరమైన విలన్స్ కన్నా.. ఎక్కువగా స్టైలిష్ విలన్స్ లుక్స్ లో అదరగొట్టేస్తున్నారు. ధృవ సినిమాలో అమ్మాయిల కలల రాకుమారుడుగా హీరోగా ఒక వెలుగు వెలిగి కెరీర్ లో బాగా గ్యాప్ తీసుకున్న అరవిందస్వామి అదరగొట్టాడు. తమిళంలోనే స్టైలిష్ విలన్ గా ఎంట్రీ ఇచ్చిన అరవిందస్వామి తెలుగులోనూ చించేశాడు. అసలు ధృవ సినిమాలో రామ్ చరణ్ తో ఈక్వల్ గా అరవింద స్వామికి పేరొచ్చింది. మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాలోనూ జగపతి బాబు స్టైలిష్ లుక్స్ తో విలన్ గా ఇరగదీశాడు. అలాగే లై సినిమాలోనూ జెంటిల్ మెన్ అర్జున్ అద్భుతంగా నటించినప్పటికీ..... ఆ సినిమాలోని మైండ్ గేమ్ జనాలకు అర్ధమే కాలేదు. ఇక విశాల్ తో అభిమన్యుడులో హీరో అర్జున్ తనదయిన స్టైలిష్ విలనిజాన్ని పండించాడు. మరి ఒకప్పటి హీరోలు ఇలా స్టైలిష్ విలన్లగా అదరగొట్టేశారు.
మరి తాజాగా మరో హీరో కూడా విలన్ గా ఎంట్రీ ఇచ్చేశాడు. తమిళంలో హీరోగా అమ్మాయిల కలల రాకుమారుడైన ఆర్ మాధవన్ ఇప్పుడు తెలుగు స్ట్రయిట్ మూవీ సవ్యసాచిలో విలన్ గా నటించాడు. సవ్యసాచి ట్రైలర్ లో చూస్తే మాధవన్ సవ్యసాచి సినిమాకి కీలకమైన విలన్, మైండ్ గేమ్ తో పచ్చడి చేసేస్తాడనే అందరూ అనుకున్నారు. అలాగే మాధవన్ విలన్ పాత్ర మీద భారీ హోప్స్ పెట్టేసుకున్నారు. కానీ దర్శకుడు చందు మొండేటి మాత్రం మాధవన్ అరుణ్ పాత్రని సవ్యసాచిలో ఫస్ట్ హాఫ్ లో అలా వెళ్లొచ్చి.. సెకండ్ హాఫ్ లో ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కానీ మాధవన్ విలన్ పాత్రను దర్శకుడు బలంగా చూపించలేకపోయాడు. కొన్నిచోట్ల మాత్రం సఖి, చెలి లాంటి సినిమాల్లో అల్లరి చేసి అమ్మాయిల మనసులు దోచుకున్న అందగాడేనా ఈ అరుణ్ పాత్ర అనిపించేలా మెప్పించాడు. అందుకే అన్నాం దర్శకుడు చందు... మాధవన్ అరుణ్ పాత్రని మనం ఊహించుకున్న స్థాయిలో డిజైన్ చేయలేదు.
దాదాపుగా మాధవన్ ది ఈ సినిమాలో సోలో పర్‌ఫార్మెన్సే. ఫోన్‌లో మాట్లాడడానికే ఎక్కువ కాల్షీట్లు ఇచ్చి ఉంటాడు. మరి చందు మాధవన్ ని ఎలా ఊహించుకుని ఈ సినిమాకోసం సెలెక్ట్ చేశాడో తెలియదు కానీ.... బలవంతుడిగా కనిపించాల్సిన విలన్ కేవలం వెకిలి నవ్వులు, ఫుల్‌స్టాప్‌లు, కామాలు అనే అర్థంలేని డైలాగులకి పరిమితమైపోయాడు. కెరీర్లో తొలిసారి పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ చేసిన మాధవన్.. తన పాత్రకు వెయిట్ తీసుకొచ్చాడు. మరి అరవింద స్వామి, అర్జున్ అంత కాకపోయినా మాధవన్ కూడా ఉన్నంతలో బాగానే మెప్పించాడు.