తాజాగా జనసేనాని రైలులో ప్రయాణిస్తూ పలువురు రైతులు, విద్యార్ధుల సలహాలు తీసుకున్నారు. మరోవైపు తాను తన అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా దేశ, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా టిడిపికి మద్దతు ఇచ్చానని, తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిందుకు తెగ ఫైర్ అయిపోయిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇక ఈయన జగన్‌పై జరిగిన దాడి గురించి కూడా స్పందించారు. జగన్‌పై ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలే దాడి చేయించారని అనడం సరికాదని, ఏ తల్లి తన కుమారుడిపై దాడి చేయించదని తెలిపాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, గతంలో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు కూడా తనను పలు విధాలుగా విమర్శించారని కానీ నేను మాత్రం వారిపై పొరపాటున కూడా ఒక్క మాట అనలేదు. పరిధిని దాటి జగన్ హత్యాయత్నంపై టిడిపి నాయకులు వ్యాఖ్యలు చేయడం సరికాదు. జగన్ హత్యాయత్నం విషయంలో రాజకీయ కోణం ఉండరాదు. అప్పుడే నిజమైన విషయాలు బయటకు వస్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందనేది వాస్తవం. పోలీసులు నా పర్యటన సందర్భంగా కూడా సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదు. తనపై కూడా కొందరు దాడికి ప్రయత్నించారు. దాని వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారో చివరకు అక్కడికే చేరుకున్నారు.
ఆయన తాజాగా ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. సినిమాల విడుదలకు ముందు ప్రీరిలీజ్ వేడుక చేస్తారు. అలాంటిదే టిడిపి-బిజెపిల కలయిక కూడా. ఇంకా సినిమా చాలా ఉంది. చంద్రబాబు నాయుడు సినిమా ఫ్లాప్ అని నేను ముందుగానే చెప్పాను. ఆయనకు అవసరం అనిపిస్తే వైసీపీతోనైనా కలవడానికి ఆయనకు ఇబ్బంది ఉండదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక గతంలో కూడా జగన్, పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించినప్పుడు కూడా పవన్, జగన్ మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పడం గమనార్హం.