తన కెరీర్ మొదటి నుంచి సరికొత్త పాత్రలు, విభిన్నపాత్రలపై మక్కువ చూపుతూ వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తోన్న బహుభాషానటుడు దగ్గుబాటి రానా. ఇక ఈయన కెరీర్ ‘బాహుబలి’ నుంచి మరింత జోరందుకుంది. ‘నేనేరాజు నేనేమంత్రి, ఘాజీ’ వంటి విభిన్నచిత్రాలతో ఈయన తన సత్తాచాటాడు. మరోవైపు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తున్నాడు. కథ నచ్చితే అది కీలక పాత్రా? లేక హీరోనా? అతిథిపాత్రా? అనే వాటిని ఈయన పట్టించుకోడని అందరికి తెలిసిన విషయమే.
ప్రస్తుతం రానా పలు భాషల్లో మంచి మంచి చిత్రాలు చేస్తున్నాడు. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నారా చంద్రబాబునాయుడుగా కనిపించనున్నాడు. తాజాగా ఆయన మరో విభిన్నచిత్రానికి ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ‘నీది నాది ఒకే కథ’ ద్వారా దర్శకునిగా తన సత్తా చాటుకున్న దర్శకుడు వేణు ఊడుగుల..దీని తర్వాత ఎంతో సమయం వెచ్చించి ‘విరాటపర్వం 1992’ అనే పీరియాడికల్ స్టోరీని తయారు చేశాడట. ఇందులోని ప్రధానపాత్ర కోసం ఆయన నేచురల్ స్టార్ నాని, నితిన్, శర్వానంద్ వంటి హీరోలను కలిశాడని తెలుస్తోంది. కానీ వీరందరు తమ తమ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండటం వల్ల చివరకు ఆయన దగ్గుబాటి రానాని కలిశాడని తెలుస్తోంది.
కథ, కథనాలలో ఉన్న వైవిధ్యం కారణంగా ఈ ప్రాజెక్ట్‌కి రానా వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో కథానాయికగా కూడా క్రేజీ హీరోయిన్ సాయిపల్లవిని తీసుకున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రానా -సాయిపల్లవి వంటి బహుభాషల్లో క్రేజ్ ఉన్న హీరోహీరోయిన్లు నటిస్తుండటం వల్ల దీనిపై అన్ని భాషల్లో భారీ క్రేజ్‌వచ్చే అవకాశం ఉంది. మరి గతంలో రాష్ట్రంలో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచిచూడాల్సివుంది...!