ఇళయదళపతి విజయ్-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సర్కార్’. ఈ చిత్రం వీరి కాంబినేషన్‌లో ‘తుపాకి, కత్తి’ తర్వాత వస్తున్న హాట్రిక్ చిత్రం కావడంతో దీని ద్వారా వీరికి హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ ఖాయమంటున్నారు. ఇక ఇందులో ప్రస్తుత దేశరాజకీయాలను, తమిళనాడులోని తాజా రాజకీయాలను బాగా చర్చించారట. దాంతో ఈ మూవీ విజయ్ ‘మెర్సల్’ కంటే భారీ విజయంతో పాటు సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. నవంబర్ 6వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఏకంగా 750 థియేటర్లలో విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 80దేశాలలో 3500లకి పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనుండటంతో దీనికి విజయ్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.
మురుగదాస్ ‘సర్కార్’తో ‘స్పైడర్’ బాకీని తీర్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో విజయ్ అమెరికా నుంచి తమిళనాడుకి తిరిగి వచ్చి రాజకీయాలలో చేరే ఎన్నారై యువకునిగా నటిస్తున్నాడు. తిరునల్వేలిలో అప్పుల బాధ తట్టుకోలేక ఒక కుటుంబంలోని నలుగురు నిప్పంటించుకుని మరణించిన సంఘటన ఆధారంగా ఇందులో ఓ సీన్‌ని చిత్రీకరించినట్లు మురుగదాస్ తెలిపాడు. ఆ సీన్‌ని నటీనటులకు వివరించేటప్పుడు తనే ఎంతో బాధపడుతూ సన్నివేశం వివరించాడట.
‘‘ఈ సీన్ చిత్రీకరణ సమయంలో నాతో పాటు మరో ఐదుగురు కూడా కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ సన్నివేశం పూర్తయిన తర్వాత ఒకరి మొహం మరొకరు కూడా చూసుకోలేకపోయారు. సెట్ అంతా నిశ్శబ్దం ఆవరించింది’’ అని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. ఈ సీన్‌తో పాటు చిత్రంలోని క్లైమాక్స్ సీన్ కూడా సినిమాకి హైలైట్ కానుందని తెలుస్తోంది.