కిందటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలను విభజించిన కాంగ్రెస్ విధానం నచ్చక మోదీ నాయకత్వంలోని బిజెపికి, ఏపీలో చంద్రబాబుకు మద్దతు తెలిపాడు. ఆ ఎన్నికల్లో ఆయన మద్దతు వల్ల టిడిపికి, బిజెపిలకు మేలు జరిగాయి అనే విషయాన్ని పక్కనపెడితే గత కొంతకాలంగా మాత్రం పవన్ వైఖరిలో తీవ్రమైన మార్పు వచ్చింది. కానీ అదే సమయంలో ప్రత్యేక హోదా విషయంలో పవన్ తీవ్రతను తగ్గించడమే కాదు.. బిజెపి ప్రభుత్వాన్ని దించేందుకు అవిశ్వాస తీర్మానం పెడితే తాను దేశమంతా తిరిగి అన్ని పార్టీల మద్దతును కూడగడుతానని చెప్పిన ఆయన ఆ తర్వాత మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు బిజెపి, మోదీ, వైసీపీ, జగన్ విషయాలతో పాటు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కూడా కాస్త మెత్తగా ఉన్న పవన్ చంద్రబాబు, లోకేష్, ఇతర తెలుగుదేశం నాయకులపై మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
తాజాగా ఆయన మరోసారి చంద్రబాబు నేతృత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఏపీ రాజధాని అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం మరో 2,400 ఎకరాలను రైతుల నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తోందని, ఒకవేళ అదే జరిగితే సహించే ప్రశ్నే లేదని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 32 వేల ఎకరాలను తీసుకున్న చంద్రబాబుపై నాడు తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా ఇప్పుడు 2,400 ఎకరాలను ప్రభుత్వం రైతుల నుంచి తీసుకోనున్నాడనే వార్తలు తాజాగా పవన్ దృష్టికి వచ్చాయట. దాంతోనే ఈయన ఈ హెచ్చరికలు చేశాడు.
2019లో ఎవరితో పొత్తు లేకుండా ఏపీలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేనాని మొత్తానికి ఇప్పుడు మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తేవడం విశేషం. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు వైసీపీ, బిజెపితో పాటు జనసేన నుంచి కూడా తీవ్ర పోటీ ఎదుర్కోనున్నాడు. ఇలా ముగ్గురిని ఎదుర్కొని ఆయన మరోసారి అధికారంలోకి రాగలడా? లేదా? ఏపీలోని ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చే అవకాశం ఉందా? వంటి పలు ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సివుంది..!