తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావుకి సరైన కుమారుడు నందమూరి హరికృష్ణ. నాడు ఎన్టీఆర్ చైతన్యరథ సారధిగా వేల కిలోమీటర్లు తండ్రికి డ్రైవర్‌గా పనిచేశారు. తన తండ్రి జ్ఞాపకాలను పదిలం చేసేందుకు తన జీవితాంతం కృషి చేసి నిజమైన కుమారుడు అనిపించాడు. అలాంటి హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందాడు. హరికృష్ణకి తన తండ్రి ఎన్టీఆర్ అంటే ఎంత ప్రాణమో, హరికృష్ణ అంటే ఆయన కుమారులైన యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లకి అంత ప్రాణం. తండ్రి తమ ప్రాణం కంటే ఎక్కువని ఎన్నోసార్లు వారు చెప్పారు. ఇక తండ్రి మరణంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
తాజాగా వారు తమ తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చడం కోసం మరో పుణ్య కార్యాన్ని ఆచరించారు. హిందు మత విశ్వాసాల ప్రకారం తల్లిదండ్రుల అస్థికలను పుణ్యనదీ జలాలలో నిమజ్జనం చేస్తే వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని, వారి ఆత్మకు శాంతి చేకూరి మరో జన్మ లేకుండా జీవితం ధన్యమవుతుందని నమ్మకం. కానీ నేడు తల్లిదండ్రులు మరణించినా కూడా తమ పనుల్లో నిత్యం బిజీగా ఉంటూ, డబ్బు సంపాదనే ధ్యేయంగా ముసలితనంలో తల్లిదండ్రులను వృద్దాశ్రమాలలో వదిలేసి, వారు మరణించినా కూడా దానిని కూడా లైవ్‌లో చూసే కుమారులు ఉన్న నేటి సమాజంలో ఎంతో బిజీ వ్యక్తులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు మాత్రం తమ తండ్రి అస్తికలను జోగులాంగ గద్వాల్ జిల్లాలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద ఉన్న పవిత్రకృష్ణానదిలో వేదమంత్రోచ్చరణల మధ్య నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్, హరికృష్ణలను చూసేందుకు భారీగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అయితే భద్రతా సిబ్బంది వారిని దగ్గరకు రానివ్వకపోవడంతో వారు నిరాశ చెందారు. మొత్తానికి నందమూరి యువకిషోరాలు తమ తండ్రి రుణం తీర్చుకుంటున్నారనే చెప్పాలి.