త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంతో 'అజ్ఞాతవాసి' బాకీని కూడా తీర్చివేసి తనపై వస్తున్న విమర్శలకు సరైన సమాధానం ఇచ్చాడు. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇక ఈయన చిత్రాలలో ఒకటి రెండు చిత్రాలు మినహా హీరోయిన్ల పాత్రలు సాదాసీదాగా ఉంటూ ఉంటాయి. అలా ఉండటానికి ఆయన తగిన కారణంతో పాటు తాను పెరిగిన వాతావరణం, తన జీవితంలో కనిపించిన మహిళలు అలాగే ఉండటం కూడా ఒక కారణమై ఉంటుందని చెబుతూ తన పాత జ్ఞాపకాలలోకి వెళ్లాడు.
ఆయన మాట్లాడుతూ, మా ఊర్లో మహిళలు అమాయకంగా, అణకువగా ఉండేవారు. నాకు అమ్మాయిలను ఏడిపించడం అనేదే తెలియదు. టీజ్ చేసినా అది సరదాగా ఉండేదే కానీ బాధపెట్టేదిగా ఉండేది కాదు. నేను పుట్టి పెరిగిన వాతావరణంలో అమ్మాయిలు ప్రశాంతంగా ఉండేవారు. ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నదే లేదు. ప్రేమ పేరుతో యాసిడ్ దాడులన్నవే మాకు తెలియవు. ఇలాంటి వాతావరణంలో నేను పుట్టి పెరిగినందువల్ల కాబోలు నా చిత్రాలలో మహిళా పాత్రలు అలానే ఉండి ఉంటాయి అని చెప్పుకొచ్చాడు.
నిజమే.. ఎంతో ప్రశాంతంగా ఉండిన పాత కాలం సమాజంలోని మహిళల పాత్రలు కూడా త్రివిక్రమ్ తరహాలోనే ఉండటం మనం బాగా గమనించవచ్చు. మనం ఎలాంటి సమాజంలో బతుకుతామో అలాంటి పాత్రలు, వాటి ప్రవర్తనలే మన నుంచి మొలకెత్తి తెరపై జీవం పోసుకుంటాయనేది ఈ విషయంలో వాస్తవమేనని మనకు అర్ధమవుతుంది.