వయసు పెరిగే కొద్ది చాదస్తం.. కోపం, బిపీ, అసహనం వంటివన్నీ పెరుగుతాయనేది నిజమే. కానీ ఇంట్లో తమ వారిపై తమ కోపం చూపిస్తే అర్దం ఉంటుంది. దానిని ఇంట్లో వారు అర్దం చేసుకోగలరు. కానీ అదే అసహనాన్ని అందరిపై చూపిస్తే మాత్రం సహించేందుకు ఎవ్వరూ సిద్దంగా ఉండరు. ఇక కోలీవుడ్ స్టార్స్‌లో సూర్య, కార్తిలకు మంచి మానవత్వం ఉన్న అన్నదమ్ములుగా మంచి పేరుంది. వారు తమ అభిమానులను ఎంతగానో ప్రేమిస్తారు. ఎలాంటి ఇగోలు, భేషజాలు లేకుండా అభిమానులతో కలిసి పోతూ ఉంటారు. కానీ వీరి తండ్రి, నాటి నటుడు అయిన శివకుమార్ ప్రవర్తనపై మాత్రం ప్రస్తుతం తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.
ఇక విషయానికి వస్తే జీవితంలో ప్రశాంతత ముఖ్యమని, దాని కోసం అందరు యోగా చేస్తూ ఉండాలని తన కుమారుల అభిమానులకు, తన ఫ్యాన్స్‌కి కూడా నిత్యం శివకుమార్ సూచిస్తూ ఉంటారు. అలాంటి ఆయన ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే దానికి ఆయన రెస్పాండ్ అయిన తీరు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. శివకుమార్ తాజాగా మధురైలోని ఓ షోరూం ఓపెనింగ్‌కి అతిథిగా హాజరయ్యాడు. మంత్రి ఆర్‌బి ఉదయ్‌కుమార్ కూడా దీనికి విచ్చేశాడు. ఈ సందర్భంగా తమ అభిమాన నటులైన సూర్య, కార్తిల తండ్రిని చూడాలని, ఆయనతో ఫొటోలు దిగాలని చాలా మంది అభిమానులు అక్కడికి వచ్చారు. శివకుమార్ రిబ్బన్ కత్తిరించడానికి వస్తూ ఉండగా, ఓ అభిమాని ఆయనకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చాలా దూరం నుంచే సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు.
కానీ నడుస్తూ వచ్చిన శివకుమార్ ఆ అభిమాని చేతిలోని మొబైల్‌ను గట్టిగా పక్కకు విసిరేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకు శివకుమర్ ఇలా ప్రవర్తించాడని అందరు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఆయన ప్రవర్తనను తప్పుపడుతూ ఘాటుగా విమర్శలు కూడా చేస్తున్నారు. సదరు అభిమానికి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది. దీనిపై శివకుమార్ ఇంకా స్పందించలేదు. కనీసం కుమారులను చూసైనా ఆయన ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలనే ఘాటు విమర్శలు ఉపందుకున్నాయి. మరి దీనిపై సూర్య, కార్తిలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సివుంది..!