నాగ చైతన్య హీరోగా వివేక్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన బెజవాడ సినిమా ఘోరమైన డిజాస్టర్ అయ్యింది. కానీ వివేక్ కృష్ణ మాత్రం సినిమా పోయినా పర్లేదు.. కేవలం క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూల మీద రెచ్చిపోయాడు. పలు ఛానల్స్ లో లైవ్ ఇంటర్వూస్ లో పాల్గొన్న వివేక్ కృష్ణ రివ్యూ రైటర్స్ సరిగ్గా రివ్యూలు రాయడం లేదని.. వాళ్ళకి రివ్యూలు రాయడం చేతకాదని అన్నాడు. ఆతర్వాత వివేక్ కృష్ణ మళ్ళీ కనబడలేదు. తర్వాత స్టార్ హీరోల సైతం రివ్యూస్ మీద విరుచుకుపడినప్పటికీ... మరీ ఘోరంగా క్రిటిక్స్ ని మీడియాని చులకన చెయ్యలేదు.
కానీ ఇప్పుడొక కుర్ర డైరెక్టర్ తన వీర భోగ వసంత రాయులు సినిమాకి సరైన రివ్యూస్ ఇవ్వలేదని.. క్రిటిక్స్ ని రివ్యూ రైటర్స్ ని ఉద్దేసించి.. ఒక వెకిలి పోస్టర్ విడుదల చేశాడు. వీర భోగ వసంత రాయలు డైరెక్టర్ ఇంద్రసేన.. ‘ఫక్ ఆల్ రివ్యూస్’ అంటూ ఒక పోస్టర్ ని విడుదల చేసి రివ్యూ రైటర్స్ మీద పడాలనుకున్నాడు. అసలు వీర భోగ వసంత రాయలు సినిమాకి రివ్యూ రైటర్స్ 1 రేటింగ్ ఇవ్వడమే ఎక్కువ. ఆ సినిమా అంత చెత్తగా వుంది. కేవలం క్రిటిక్స్ మాత్రమే ఆ మాట అనడం లేదు.. ప్రేక్షకులు కూడా వీర భోగ వసంత రాయలు సినిమా చూసిన తర్వాత అదే మాటంటున్నారు.
ఆ సినిమాలో విషయం లేదని రివ్యూ రైటర్స్ ఓవర్సీస్ టాక్ తోనే ఏసుకున్నారు. అలాగే ఇక్కడ విడుదలయిన మొదటి షోకే సినిమా చెత్త అంటూ కాంప్లిమెంట్స్ వచ్చేశాయి. అయితే రివ్యూ రైటర్స్ సినిమాకి చెత్త రివ్యూ అంటూ ఇచ్చేసరికి కడుపుమండిన ఇంద్రసేన అలాంటి పోస్టర్ ని విడుదల చేశాడు. అయితే అలా పోస్టర్ విడుదల చేసిన కొద్ది సేపటికే ఆ సినిమాలో హీరోలుగా నటించిన నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు దర్శకుడు ఇంద్రసేనకి క్లాస్ పీకారట. అంతేకాకుండా ఇంద్రసేనని ఎడా పెడా వాయించేశారట.
అసలే ప్లాప్స్ లో ఉన్న హీరోలాయే.. ఇపుడు మీడియాని, రివ్యూ రైటర్స్ ని కెలుక్కుంటే వారి భవిష్యత్తు ఏమవుతుందో వారికి తెలుసు. అందుకే ఇంద్రసేనకి క్లాస్ పీకి వదిలారు. కేవలం క్లాస్ కాదు అసలు దర్శకుడు ఇంద్రసేనకి తమకి సంబంధమే లేదంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు కూడా. మరి ఈ దర్శకుడుకి ఎంతగా తన చెత్త సినిమా మీద నమ్మకం లేకపోతే.. టాప్ డైరెక్టర్ సుకుమార్‌ని ఒక ఈవెంట్ లో స్టేజ్ మీదే మీరు తీసిన వన్ నేనొక్కడినే నచ్చలేదని చెప్పాడు. మరి తనకైతే నచ్చలేదని చెప్పే హక్కుంటుంది కానీ.... రివ్యూ రైటర్స్ కి మాత్రం ఉండదా.... ఇదెక్కడి న్యాయం చెప్పండి.