పాతతరంలో మహానటి సావిత్రి, భానుమతి వంటి వారు దర్శకురాళ్లుగా కూడా మారారు. ఆ తర్వాత తరంలో విజయనిర్మల, జీవిత, మంజులానాయుడు, బి.ఎ.జయ, నందినిరెడ్డి, శ్రీప్రియ, రేవతి వంటి వారు తమ సత్తా చాటారు. ఇక బహుముఖ ప్రజ్ఞావంతులైన మహిళలు పురుషాధిక్య సినీ రంగంలో పెద్దగా దర్శకులుగా రాణించలేకపోతున్నారు. కానీ బాలీవుడ్‌లో మాత్రం లేడీ డైరెక్టర్స్‌కి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఇక విషయానికి వస్తే నిత్యామీనన్ నుంచి మహానటి ద్వారా సత్తా చాటిన మలయాళ కుట్టి అయిన కీర్తిసురేష్ కూడా మెగా ఫోన్ చేపట్టాలని భావిస్తోందిట.
ఇటీవల ‘మహానటి’తో పాటు ఆమె నటించిన ‘పందెంకోడి2’లో కూడా ఈమె తన ప్రతిభను చాటుకుంది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతున్న ‘సర్కార్’ అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. తమిళ, తెలుగు భాషల్లో మంచి క్రేజ్ ఉన్న ఆమె దర్శకత్వంపై ఉన్న ఆసక్తితోనే సెట్స్‌లో తన పార్ట్ షూటింగ్ అయిపోయినా కూడా దూరంగా వెళ్లకుండా కెమెరా ముందు నుంచి వెనుకకు వెళ్లి దర్శకత్వంపై అవగాహన పెంచుకుంటోందిట. ఇలాంటి పలు విభాగాలపై ఆమె బాగా సునిశిత పరిశీలనతో ముందుకు వెళ్తోంది. ఇక షూటింగ్ లేని సమయాల్లో ఈమె తనలోని మేధస్సుని ఉపయోగించి పలు కథలను కూడా రెడీ చేసుకుంటోందిట.
కథానాయికగా ఫేడవుట్ అయిన తర్వాత ఆమె మెగా ఫోన్ చేపట్టడం ఖాయమనే తెలుస్తోంది. మొత్తానికి ఈ అమ్మడు తనలోని టాలెంట్‌ని సరిగా వాడుకుంటూ దర్శకత్వ విభాగంలో కూడా తనంటూ ప్రత్యేకశైలిని చూపించాలని ఆమె తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ఆమెకి బాగా ప్రోత్సాహం అందిస్తున్నారని సమాచారం. ఈమె తల్లి మేనక నటి కాగా, ఈమె తండ్రి మలయాళంలో పెద్ద నిర్మాత కూడా కావడం కూడా ఈమెకి ఆ విధమైన ప్రోత్సాహం లభిస్తుండటానికి కారణమనే చెప్పాలి. మరి ఈమె మెగాఫోన్‌తో కూడా తన సత్తాచాటుకోవాలని ఆశిద్దాం...!