తెలుగులో తన సత్తా చాటిన నిన్నటితరం హీరోయిన్ శోభన. ఈమె మంచి నటే కాదు.. ఎంతో గొప్ప నృత్యకళాకారిణి కూడా. ఈమె వివాహం సైతం చేసుకోకుండా తన జీవితాన్ని నాట్యకళారాధణనే అంకితం చేసింది. తాజాగా ఈమె.. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. సినిమాలకు దూరంగా ఉంటున్నారు...? అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, నేను సినిమాలు మానేయలేదు. జీవితం అంటే కేవలం సినిమాలే కాదు.. చాలా ఉన్నాయి. అందులో సినిమా ఒక భాగమేననేది నా అభిప్రాయం. డ్యాన్స్ అనేది కూడా నాకు ఓ కెరీరే. ‘కళార్పణ’ పేరుతో నాకు ఓ డ్యాన్స్ స్కూల్ ఉంది. సమయమంతా దానికే సరిపోతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో కూడా సినిమాలను ప్రదర్శించాలనే ఆశయంతో స్థాపించిన ‘జాదూజ్’ సెంటర్‌కి సహవ్యవస్థాపకురాలిగా ఉన్నాను. అలా అని అన్ని గ్రామాలకు నేనే స్వయంగా వెళ్లాలంటే వీలుకాదు. కొన్ని గ్రామాలకు మాత్రం వెళ్లాలనుకుంటున్నాను.
నిజానికి ‘జాదూజ్’ని స్థాపించినప్పుడు దానిని ఓ వ్యాపారంలాగానే భావించాను. చిన్నచిన్న గ్రామాలలో కూడా సినిమాలు ప్రదర్శించడంతో పాటు అక్కడ కేఫ్‌లు, టిఫిన్స్ సెంటర్స్‌ని పెట్టి వారికి ఓ ఫీల్‌ని కలిగించే అవకాశం ఉంది. చిన్నవూళ్లకు కూడా మాల్స్‌లాంటివి చేరువ చేయాలనే ఉద్దేశ్యంతోనే ‘జాదూజ్’లో భాగస్వామ్యం అయ్యాను. పైగా అన్నింటిని నేనే చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా ఆలోచనలను అమలులోకి తీసుకురావడానికి నా వద్ద ఓ టీం ఉంది. నాకు తెలిసి నటికి, నాట్యకళాకారిణికి తేడా చెప్పమంటే చెప్పలేను. నాకు రెండు ఇష్టమే.
ఒకప్పటి నటీమణులు వైజయంతీమాల, హేమమాలిని, మా అత్తయ్య పద్మినిగారిలను తీసుకుందాం. వీళ్లు మంచి క్లాసిక్ డ్యాన్సర్స్. అద్భుమైన ఆర్టిస్టులు కూడా. సినిమాలలో వారు ఎన్నో క్లాసికల్ డ్యాన్స్‌లకు డ్యాన్స్‌లు అద్భుతంగా చేశారు. ప్రేక్షకులు వీరిని మంచి నటీమణులుగానే కాకుండా మంచి నాట్యకళాకారిణులుగా కూడా గుర్తించి ఆదరించారు. నన్ను అలాగే గుర్తుంచుకుంటారని నాకు అనిపిస్తోంది. మా అత్తయ్యలు అయిన ‘ట్రావెన్‌కోర్ సిస్టర్స్’ క్లాసికల్ డ్యాన్స్‌లు నేర్చుకుని సినిమాలలోకి వచ్చారు.
డ్యాన్స్ అనేది ట్రెడిషనల్ ఆర్ట్ అని, సినిమా డిఫరెంట్ అని నేను రెండింటిని విడివిడిగా చూడలేను. వేరు వేరు అనుకుంటే వేరుగా అనిపిస్తుంది. కానీ రెండు వేరు వేరు కాదు. అత్తయ్యలలానే నేను కూడా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. వాళ్లలానే సినిమాలలోకి వచ్చాను. రెండు ఆర్ట్సే. మొదట్లో మ్యాథ్స్ ఉండేది. ఆ తర్వాత దానిలో జామెంట్రీ, ఆల్‌జీబ్రా వంటివి విడివిడిగా వచ్చాయి. కళ కూడా అంతే. వివిధ రూపాలుగా అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఎన్ని రూపాలు వచ్చినా మనం దానికి చివరకు ‘కళ’ అనే అంటాం. నాట్యం అనేది కళ అనుకుంటే నటన కూడా కళే.. అని చెప్పుకొచ్చింది.