‘మీటూ’ ఉద్యమం బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండల్‌వుడ్ ఇలా అన్నిచోట్లా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు ఉన్నాయని వాదిస్తుంటే, ఆరోపించబడిన నిందుతులు కూడా ఎంతో నమ్మకంగా న్యాయస్థానాలలోనే చూసుకుందామని అంటున్నారు. బాధితులు తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటే నిందుతులు అవి న్యాయస్థానాలలో నిలిచేవి కాదనే భరోసాలో ఉండటం విశేషం. ఇక ఈ ‘మీటూ’ ఉద్యమం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిపై మాత్రం అందరు వారు జెంటిల్‌మెన్‌లు.. వారు ఇలా చేయడం నమ్మలేకున్నామని అంటున్నారు. ప్రజలలోనే కాదు.. పలువురు సినీ ప్రముఖుల నమ్మకం కూడా ఇదే. వారిద్దరే దేశం గర్వించదగ్గ నటులైన నానాపాటేకర్, యాక్షన్‌కింగ్ అర్జున్‌లు.
అర్జున్‌కి కన్నడ, తెలుగు, తమిళ భాషలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండటంతో ఇది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంలో అర్జున్ కుటుంబంతో పాటు ఖుష్బూ వంటి పలువురు సీనియర్ నటీనటులు ఆయనకు క్లీన్‌చిట్ ఇస్తున్నారు. కానీ ఆయనపై ఆరోపణలు చేసిన నటి శృతిహరిహరన్ మాత్రం అర్జున్‌కి సంబంధించి, నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, దానికి సంబంధించి తన వద్ద ఖచ్చితమైన ఆధారాలున్నాయని తెలిపింది.
అంతేకాదు.. అర్జున్ న్యాయస్థానంలో తేల్చుకుందామంటే నేను సిద్దం. ఆయన ఎంతకు నాపై పరువు నష్టం దావా వేసినా దానిని కూడా ఎదుర్కొనేందుకు నేను రెడీగా ఉన్నాను. బెదిరింపులకో, ఇతర పెద్దలు వత్తాసు పలుకుతున్నారనో నేను భయపడేది లేదు. ఈ విషయంలో నాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి మాత్రం నేను ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లితే అక్కడే ఆధారాలు బయటపెడుతాను.. అని నమ్మకంగా ఛాలెంజ్ చేయడం ఇప్పుడు మరోసారి దీనిపై చర్చకు ఆస్కారం ఇచ్చిందనే చెప్పాలి. మొత్తానికి లోగుట్టు మాత్రం పెరుమాళ్లకెరుక అనే చెప్పాలి.