హీరో శివాజీ మొదట్లో బిజెపిలో చేరాడు. ఆ తర్వాత బిజెపి కూడా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంతో ఆయన దాని నుంచి బయటకు వచ్చి ఇప్పటికీ ప్రత్యేకహోదా విషయంలో చలసాని శ్రీనివాస్‌తో పాటు పలువురితో కలసి గళం వినిపిస్తూ ఉన్నాడు. నిజానికి ఈయన హీరోగా పెద్ద స్టార్, ఫ్యాన్ ఫాలోయింగ్ లేనప్పటికీ ఆయన మాటల్లో మాత్రం నిజాయితీ కనిపిస్తోంది. అదే సమయంలో ఆయనకు కాస్త కులపిచ్చి కూడా ఉందని, అందుకే ఒకనాడు పరిటాల రవికి, ప్రస్తుతం చంద్రబాబునాయుడుకి అనుకూలంగా మాట్లాడుతున్నాడనే విమర్శ ఉంది. కానీ ఎందుకో గానీ ఆయన మాటల్లో నిజాయితీని మాత్రం నమ్మాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆయనను టిడిపి బ్రోకర్‌గా అభివర్ణించేవారు ఉన్నప్పటికీ ఆయన చెప్పిన కేంద్రంలోని 'ఆపరేషన్ గరుడ' విషయంలో మాత్రం ఆయన ఎప్పుడో చెప్పిన విషయాలు ఒక్కొక్కటిగా నిజమని తేలుతూ వస్తున్నాయి. అసలు ఈ విషయాలు కేవలం శివాజీకి మాత్రమే ఎలా తెలిశాయి? అనే వాదనను పక్కనపెడితే ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిలో నెట్‌వర్క్ ఉంటుందనే విషయాన్ని కాదనలేం. ఆయన చెప్పినట్లుగానే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ గరుడలోని రహస్యాలను అమలు చేస్తూ ఉండటం ఆయనపై మరింత నమ్మకం కలిగేలా చేస్తోంది.
ఆయన ఏపీ సీఎంపై చట్టబద్దమైన సంస్థల ద్వారా వేధిస్తారని తెలిపాడు. బాబ్లీ కేసులో చంద్రబాబుకి సమన్లు రావడం, టిడిపి నేతలపై వారి అనుకూలురులపై ఏపీ, తెలంగాణలో దాడులు జరుగుతూ ఉండటం గమనార్హం. రేవంత్‌రెడ్డి నుంచి సీఎం రమేష్‌తో పాటు నెల్లూరు జిల్లాలోని టిడిపి నాయకులైన బీదా మస్తాన్‌రావు వంటి వారిపై కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. అక్రమార్కులపై అధికారులు దాడులు చేయడంలో ఎలాంటి తప్పు లేనప్పటికీ, అవి కేవలం కొన్ని పార్టీల నాయకులను, అందునా ఎన్నికల ముందు ఇవి జరుగుతుండటం మాత్రం కక్ష్యసాధింపు చర్యల కిందకే వస్తుందని చెప్పాలి. నాలుగున్నరేళ్లు ఎవరిపై సోదాలు నిర్వహించకుండా, తమిళనాడులో ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసేందుకు అక్కడ, కర్ణాటక వంటి పలు చోట్ల ఈ రకమైన దాడులే జరిగాయి. ఇక ప్రతిపక్షనేత మీద ప్రాణహాని లేకుండా హత్యాయత్నం టైప్‌లో దాడులు జరుగుతాయని శివాజీ ముందే చెప్పాడు. అనుకున్నట్లుగానే వైసీపీకి చెందిన కార్యకర్తే, అందునా కేవలం కోడిపందెలలో వాడే కత్తితో జగన్‌కి చేతి మీద దాడి చేయడం ఈ అనుమానాలను బలోపేతం చేస్తోంది. హత్యాయత్నం చేసే వారెవ్వరూ అలాంటి కత్తిని గానీ, చేతిపై గానీ దాడి చేయరనేది వాస్తవం. అందునా సిసీ ఫుటేజీల నుంచి విమానాశ్రయంలో ఈ తరహా ఘటన జగన్‌పై జరగడం వీటికి మరింత బలమైన ఊతం ఇస్తోంది.
ఇక తాజాగా శివాజీ మరోసారి తాను చెప్పిన ఆపరేషన్ గరుడ గురించి మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రిని ఏదో విధంగా పదవీచిత్యుడిని చేయడానికి ప్రయత్నం జరుగుతోందని ప్రత్యేకహోదా సాధన సమితి నేత, హీరో శివాజీ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. ఈ మూడు నెలల్లో చంద్రబాబును పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రంలో రాబోయే ఎన్నికల తర్వాత చంద్రబాబు కీలకనేతగా మారుతాడని కేంద్రం కనిపెట్టింది. అందుకే ఆయనను పదవి నుంచి కూల్చివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీలో ప్రభుత్వాన్ని ఏదో విధంగా కూలదోయాలని ప్రయత్నిస్తున్నారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద, ప్రభుత్వం మీద ఉంది. ఏపీలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ది చంద్రబాబు ఇమేజ్ వల్లే జరుగుతోంది. కేంద్రం సాయం చేయకపోయినా ఏపీలో అభివృద్దికి బాబే కారణం.
అయితే ఈ అభివృద్ది శాశ్వతం కాదు. ప్రత్యేకహోదాతోనే అసలైన అభివృద్ది జరుగుతుంది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు. ఈ పరిణమాలన్ని గతంలో నేను చెప్పినవే. ఆపరేషన్ గరుడలో భాగంగానే ఇవ్వన్నీ జరుగుతున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా ఏపీకి ప్రత్యేకహోదా కోసం మాత్రం నా పోరాటం ఆగదు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూలదోస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని శివాజీ తెలిపాడు. మరి ఈ రహస్యాలన్నీ కేవలం శివాజీకి మాత్రం ఎలా తెలుస్తున్నాయి? అనే అనుమానం మాత్రం అందరిలో ఉందనే చెప్పాలి.