'మీటూ' ఉద్యమం మంచిదే గానీ దానిని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు, గృహహింసల కేసుల లాగా కక్ష్యసాధింపు చర్యలుగా మారితే మాత్రం వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ఉద్యమాన్ని నిజాయితీగా చేయాలని సూచిస్తున్నారు. తాజాగా మరో మహిళ ఓ ప్రముఖుడిపై ఇలాంటి ఆరోపణలే చేయడం చర్చనీయాంశం అయింది. ప్రముఖ టీవీ నటి సోనాల్ వెంగులేర్కర్ పరిశ్రమలో గతంలో తాను ఎదుర్కొన్న వేధింపులను బయట పెట్టింది. నేను పరిశ్రమలోకి రాకముందే 19ఏళ్ల వయసులో ఫొటోగ్రాఫర్, క్యాస్టింగ్ డైరెక్టర్ రాజ బజాజ్ తనని వేధించాడని తెలిపింది.
ఆమె మాట్లాడుతూ, నేను తాంత్రిక విద్యలు నేర్పుతాను. వాటితో రాత్రికి రాత్రే విజేతలవుతారు అని చెబుతూ నా దుస్తులను తొలగించే ప్రయత్నం చేశాడు. బలవంతంగా నా చాతిపై క్రీమ్‌లు పూశాడు. ఓ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆడిషన్ అవకాశం చూసి రాజ్ బజాజ్‌ని సంప్రదించిన క్రమంలో నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. రాజ్ ప్రవర్తనకు షాక్ అయిన నేను 2012లోనే కస్తూర్బామార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను... అని చెప్పుకొచ్చింది.
దీనిపై రాజ్‌బజాజ్ స్పందించాడు. సోనాల్ మార్చి 7వ తేదీన మా ఇంటికి వచ్చి నన్ను డబ్బులు డిమాండ్ చేసింది. మొదట 3లక్షలు డిమాండ్ చేసిన వారు తర్వాత ఒకటిన్నర లక్షలకు దిగి వచ్చారు. అయినా నేను దానిని తిరస్కరించాను. దాంతోనే ఆమె నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని సోనాల్ వ్యాఖ్యలను ఖండించాడు.