ఇప్పటికే చిన్మయి శ్రీపాద, మరో అజ్ఞాత మహిళ వైరముత్తుపై లైంగిక వేధింపులు, అసభ్యప్రవర్తన వంటి విషయాలపై మీటూ ఉద్యమంలో తమ గళం వినిపిస్తున్నారు. నిజానికి వైరముత్తు పైకి మంచి పెద్ద మనిషిగా కనిపిస్తాడని, కానీ ఆయన నైజం మాత్రం అదేనని కోలీవుడ్‌లోని పలువురు గుసగుసలాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ సోదరి రెహానా కూడా ఆరోపించింది. ఆయన పలువురు గాయనీ మణులను వేధించే వాడని ఆమె తెలిపింది. ఆమె మాట్లాడుతూ, ఆయన వ్యవహారాల గురించి నేను చాలా విషయాలు విన్నాను. యువ గాయనీ మణులను ఆయన ట్రాప్ చేసేందుకే ఏకంగా నా సోదరుడు ఎ.ఆర్.రెహ్మాన్ పేరును సైతం ఆయన వాడుకునేవారు. ఈ విషయాలేవీ నా సోదరుడికి తెలియవు. వైరముత్తుపై గాయని చిన్మయి శ్రీపాద చేసిన ఆరోపణలను నేను నమ్ముతున్నాను. ఈ విషయం బయటకు రాగానే రెహ్మాన్ నన్ను ఇవ్వన్నీ నిజమేనా? అని అడిగాడు. అప్పుడు నేను నా సోదరుడికి వైరముత్తు గురించి అసలు నిజాలు చెప్పాను. నేను మీటూ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాను అని రెహానా తెలిపింది.
మరోవైపు వైరముత్తుపై ఆరోపణలు, మీటూ ఉద్యమంపై రెహ్మాన్ కూడా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, మీటూ ఉద్యమం ద్వారా లైంగిక వేధింపుల విషయంలో బయటకు వస్తున్న ప్రముఖుల పేర్లు నన్ను షాక్‌కి గురిచేస్తున్నాయి. బాధితులు, నిందితులు ఇద్దరికీ ఒకటే చెబుతున్నాను. మన చిత్ర పరిశ్రమ నిజాయితీగా, మహిళలను గౌరవించే విధంగా ఉండాలనేది నా కోరిక. ధైర్యంగా తమపై జరిగిన లైంగిక వేధింపులను బయట పెట్టిన బాధితులకు దేవుడు మరింత శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కరు తమ నైపుణ్యం పెంపొందించుకునేందుకు, విజయవంతం కావడానికి వీలుగా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని నేను, నా టీం నిర్ణయించాం.
బాధితులు స్చేచ్చగా తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశాన్ని సోషల్ మీడియా కల్పిస్తోంది. ఇంటర్నెట్‌లో ఇలాంటి విషయాలను ప్రస్తావించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే దీనిని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉందని రెహ్మాన్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఆయన ట్వీట్‌ని గాయని చిన్మయి శ్రీపాద రీట్వీట్ చేయడం విశేషం.