గతంలో టిడిపి అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్‌ని తన ఎన్నికలలో తురుపుముక్కగా వాడుకోవాలని భావించాడు. అందుకే ఆయన చేత పలు చోట్ల ఎన్నికల ప్రచారాలు కూడా నిర్వహించాడు. కానీ నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హవా సాగుతున్న సమయంలో ఎన్టీఆర్ మంత్రం సరిగా పనిచేయలేదు. దాంతో పాటు హరికృష్ణకు పార్టీలో ప్రాధాన్యం తగ్గించడం, ఎన్టీఆర్‌ని కూడా లోకేష్ మీద ఉన్న మమకారంతో దూరం పెట్టాడనే విమర్శలు వచ్చాయి. ఇక గత ఎన్నికల్లో బాలకృష్ణకి ఎమ్మెల్యే సీటు ఇప్పించినా, ఆయన చేత పెద్దగా ప్రచారం మాత్రం బాబు చేయనివ్వలేదు. అయితే పరిస్థితులు హరికృష్ణ మరణానంతం మరలా మారుతున్నాయా? పాత సమీకరణాలు వస్తున్నాయా? అనే అనుమానాలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ అండ లభించడంతో చంద్రబాబు మరో స్టార్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు.
కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. చంద్రబాబు-పవన్‌లు ఉప్పునిప్పులా మారారు. సో.. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఎన్టీఆర్‌ని చంద్రబాబు దగ్గరకు తీస్తాడనే ప్రచారం మొదలైంది. చంద్రబాబు నైజం తెలిసిన వారు ఇది వాస్తవ రూపం దాల్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని భావిస్తున్నారు. ఇక తాజాగా బాలయ్య బాబాయ్‌తో కూడా ఎన్టీఆర్‌కి క్రమేణా మంచి బంధం ఏర్పడుతోంది. దీంతో ఈసారి జూనియర్ ఎన్టీఆర్ సేవలకు టిడిపి విజయం కోసం బాబు ఉపయోగించుకోవచ్చునని తెలుస్తున్నా.. ఆల్‌రెడీ చంద్రబాబు చేతిలో ఒకసారి యూజ్ అండ్ త్రోకి గురైన ఎన్టీఆర్ మరోసారి ఆ అవకాశం బాబుకి ఇస్తాడా? లేదా? అనేది వేచిచూడాల్సి వుంది. అదే సమయంలో మెగాభిమానులలో కూడా కొత్త ఆశలు మొదలయ్యాయి.
కొంత కాలం కిందట పవన్-అల్లుఅర్జున్‌ల అభిమానుల మధ్య బాగా వైరం నడిచింది. ప్రస్తుతం అది కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. మరోవైపు బాబాయ్ పవన్‌కళ్యాణ్ ఆదేశానుసారం అబ్బాయ్ రామ్‌చరణ్ తిత్లీ తుఫాన్ వల్ల నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. ఇది జనసేనకు వచ్చే ఎన్నికల్లో మరింత అండగా నిలవనుందనే చెప్పాలి. అదే సమయంలో చిరు, బన్నీ అభిమానులు కూడా పవన్‌కి మద్దతు తెలిపితే వచ్చే ఎన్నికల్లో జనసేనకి అది కొండంత అండగా నిలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే విషయాన్ని విశ్లేషకులు అంగీకరిస్తున్నారు.