తెలుగులో మంచి నటీమణులకు కొదువలేదు. సావిత్రి, అంజలీదేవి, జమున నుంచి శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, భానుప్రియ, సుహాసిని, సౌందర్య వరకు ఎందరో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు అంతే ప్రతిభ ఉన్న నటిగా 'మహానటి' ద్వారా స్టార్ హీరోయిన్ అయిన కీర్తిసురేష్‌ని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈమె హవా సాగుతోంది. గ్లామర్‌షోకి నో చెబుతూనే కేవలం నటనపైనే భారం మోపి ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఈమెకి విజయ్, సూర్య, పవన్‌కళ్యాణ్ వంటి స్టార్స్‌తో నటించే చాన్స్‌లు వచ్చాయి. ఇక ఇటీవల విడుదలైన విశాల్ 'పందెంకోడి 2'లో నటించింది. దీపావళికి ఈమె విజయ్‌తో మరోసారి కలిసి నటించిన మురుగదాస్ చిత్రం 'సర్కార్' విడుదలకు సిద్దమవుతోంది.
ఇక తాజాగా ఈమె మాట్లాడుతూ హీరోల వయసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నతనం నుంచి చూస్తోన్న హీరోల సరసనే ఇప్పుడు తాను నటిస్తూ ఉంటే మీ ఫీలింగ్ ఏమిటి? అనే ప్రశ్నకు స్పందిస్తూ, నేను ఎందరో హీరోల చిత్రాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు వారి సరసనే హీరోయిన్‌గా నటించే అవకాశాలు వస్తున్నాయి. అయితే ఏ హీరో వద్ద నేను ఈ విషయం గురించి చెప్పను. నా మనసులోనే దాచుకుంటాను. హీరోల దగ్గర 'చిన్నప్పుడు మీ చిత్రాలు చూస్తూ పెరిగాను' అంటే ఆయా హీరోలకు వారి వయసు వారికి గుర్తుకు వచ్చి హర్ట్ అవుతారనే నా అభిప్రాయం. హీరోలంటే నాకెంతో అభిమానం. వారిని కొలీగ్స్‌గా చూడను. ఈ అవకాశాలు, గుర్తింపు అంతా దేవుడి దయ అని ఎంతో లౌక్యంగా స్పందించింది.
అయితే ఈమెకి ఈ జ్ఞానోదయం ఇటీవలే అయినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఈమె తండ్రి మలయాళ నిర్మాత, తల్లి నటి. తన తల్లి హీరో సూర్య తండ్రితో నటించేటప్పుడు తాను చిన్నతనంలో సూర్యతో నటిస్తానని పందెం కట్టానని, అనుకున్నట్లే నటించానని, చిన్ననాటి నుంచి చూస్తూన్న హీరో పక్కనే నటించడం ఎంతో ఆనందంగా ఉందని ఒకసారి చెప్పుకొచ్చింది సుమా...!