ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం నాన్-బాహుబలి రికార్డులను, 'రంగస్థలం' సృష్టించిన ప్రభంజనాన్ని దాటి ముందుకు వెళ్తుందా? లేదా? అనేది ఫిల్మ్‌నగర్‌లో చర్చనీయాంశం అయింది. ఇక ఇందులో ఎన్టీఆర్ తర్వాత నటునిగా ఎక్కువ క్రెడిట్ దక్కించుకున్నది విలన్ బసిరెడ్డిగా నటించిన జగపతిబాబు. తాజాగా ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో జగపతిబాబు చేసిన ప్రసంగం ఎంతో ఉద్వేగభరితంగానే కాదు.. హృద్యంగా సాగి, ఆహుతులను కట్టిపడేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందని ఎప్పుడో చెప్పాను. ఈ సందర్భంగా నేను రెండు విషయాలను చెప్పాలని అనుకుంటున్నాను. 2010లో హీరోగా నా కెరీర్ అయిపోయింది. కానీ 2012లో మా బాలయ్య బాబుతో 'లెజెండ్' చిత్రం ద్వారా విలన్‌గా నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. బాలయ్య, తారక్ ఇద్దరిలో నాకు ఒకే లక్షణం కనిపించింది. 'లెజెండ్' చిత్రంలో నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండాలని నాడు బాలయ్యబాబు డైరెక్టర్‌పై ఒత్తిడి తెచ్చారు. అదే పనిని ఈ చిత్రంలో తారక్ కూడా చేశాడు.
నాకు తెలియకుండానే బాలయ్య బాబు నాకు ఒక మంచి పని చేశారు. అది బయటకు చెప్పలేను. తారక్, త్రివిక్రమ్‌లతో గదిలో కూర్చున్నప్పుడు కూడా ఓ మంచి పని జరిగింది. దానిని కూడా బయటకు చెప్పుకోలేను. 'నాన్నకు ప్రేమతో' చిత్రం షూటింగ్ సమయంలో నేను తారక్‌తో మాట్లాడుతూ, 'తారక్.. నిన్ను.. బాలయ్య, బాబాయ్‌ని ఒకే వేదికపై చూడాలని ఉంది' అని చెప్పాను. దానికి తారక్ సమాధానం ఇస్తూ, బాబు.. ఆయన నా బాబాయ్ బాబు... ఆయనంటే నాకు చాలా ప్రేమ. ఆయనంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు. నేనెప్పుడు ఏ యాక్టర్‌తోనూ కలిసి ఫొటోలు దిగలేదు. ఈరోజు కావాలనే ఇద్దరితో కలసి ఫొటోలు దిగాను. నందమూరి ఫ్యామిలీ ఎంతో గొప్పది. నందమూరి అభిమానులు కూడా ఎంతో గొప్పవారు. అందరు మంచిగా కలసికట్టుగా ఉండాలి. అసలైన దీపావళి, దసరా ఇక్కడ కనిపిస్తోంది.. అని చెప్పుకొచ్చారు.
నిజమే.. ఈ విషయంలో బాలయ్య, తారక్ ఇద్దరు గ్రేట్. ఎందుకంటే విలన్ పవర్‌ఫుల్‌గా ఉంటేనే హీరోయిజం ఎలివేట్ అవుతుందనే విషయాన్ని కొందరు హీరోలు మర్చిపోతున్నారు. తమ హీరోయిజం ముందు విలన్‌ని బఫూన్లను చేస్తున్నారు. పక్కవారు తమ కంటే బాగా చేస్తే అది వారికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం బాలయ్య, తారక్‌లు ముందడుగు వేయడం మంచి పరిణామమనే చెప్పాలి.