నాడు ఎన్టీఆర్‌కి ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. తనతో మనవరాలిగా నటించిన అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఆయన సరసన అతి పిన్నవయసులో ఎంతో ఇష్టపడి మరీ 'వేటగాడు' చిత్రంలో నటించింది. ఇక ఈయనంటే జయసుధ, జయప్రద నుంచి ఎందరో అందగత్తెలు ఆయనంటే పడి చచ్చేవారు. ఆయనతో ఓ చిత్రం చేయాలని కలలు గనే వారు. కానీ ఇలాంటి అందగత్తెలు ఎందరో ఎన్టీఆర్‌ని వివాహం చేసుకోవడానికి రెడీగా ఉండేవారు. అందునా వయసు మీరినా కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండటంతో ఆయనకు అందమైన అమ్మాయిలు రెండో వివాహం చేసుకోవడానికి దొరకలేదా? అనే ప్రశ్న అందరిలో ఉదయించేది. ఇక ఆయనకు కావాల్సినంత రాజకీయ పలుకుబడి, డబ్బు, స్టార్ హీరోగా ఇమేజ్.. ఇలా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ సందేహం అందరికీ రావడం సహజం.
అయితే ఆయన ఆల్‌రెడీ వీరగ్రంధం సుబ్బారావును పెళ్లి చేసుకుని వదిలేసిన లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ రెండో వివాహం ఎందుకు చేసుకున్నాడు? ఆయన బయోగ్రఫీ రాయాలని ఆమె వెళ్లినా ఇష్టం ఉంటే అనుభవించి వదిలేసే సత్తా ఆయనకు ఉన్నాయి. కానీ ఆయన డేర్‌గా అందరి ముందు లక్ష్వీపార్వతిని పబ్లిక్ మీటింగ్‌లో ప్రకటించి మరీ వివాహం చేసుకున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా అన్నాడు. ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది అందగత్తెలు ఎందరితోనే నటించిన ఎన్టీఆర్‌కి పెళ్లి చేసుకోవడానికి లక్ష్వీపార్వతినే దొరికిందా? అనే పాయింట్ వద్ద నెగటివ్ ఇంప్రెషన్‌తో నా ఆలోచన మొదలైంది. చివరకు లక్ష్మీపార్వతిపై ఉన్న నెగటివ్ ఆలోచన కాస్తా పాజిటివ్‌గా మారింది. ఆయన జీవితంలోని కొన్ని నిజమైన, పచ్చి నిజాలను చూపించడానికే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' బయోపిక్ తీస్తున్నాను. అందగత్తెలను ఎవరిని వివాహం చేసుకోని ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం ఏమిటని ఆలోచించేవాడిని. ఎన్టీఆర్‌ని అందరు అద్భుత మేథస్సు కలిగిన వ్యక్తిగా ప్రతి ఒక్కరు పొగుడుతారు. రాజకీయాలనే మార్చేసిన శక్తిగా ఆయనను చెబుతారు. విధాన పరమైన నిర్ణయాలలోనూ ఆయనకు ఆయనే సాటి.
అయితే లక్ష్మీపార్వతి విషయం వచ్చే సరికి ఆ ఒక్కటి తప్పు నిర్ణయం అంటూ ఉంటారు. అలా ఎందుకు అంటున్నారు? అనే ఆలోచనతో ఈ చిత్రానికి కథను తయారు చేశాను. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కింద పనిచేసి, ఆయన గురించి అన్ని తెలిసిన అధికారులు, ఆయనతో మంచి పరిచయం ఉన్న అందరినీ కలిసి వివరాలు సేకరించాను. ఎన్టీఆర్ మరణించే ముందు వారం కిందట ఇచ్చిన ఇంటర్వ్యూని కూడా చూశాను. ఈ వీడియోలో ఆయన లక్ష్మీపార్వతి గురించి ఎంతో గొప్పగా, గౌరవంగా మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత ఆయన జీవితంలో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు జరిగాయి. అవి ఆయన జీవితాన్నే మార్చేశాయి. నాకు తెలిసి ఎన్టీఆర్ జీవితంలో డైనమిక్ ఫేజ్ లక్ష్మీపార్వతే. ఆనందం, సుఖం, దు:ఖం, మోసం, కోపం వంటివి అన్ని వారి జీవితాలలో ఉన్నాయి. అంతేకానీ ఇది బయోపిక్ కాదు అని తెలిపాడు.
ఇక ఎన్టీఆర్‌ని వైశ్రాయ్ హోటల్లో చెప్పులు విసిరి అవమానించడం, ఆయనను ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించి చంద్రబాబు సీఎం కావడం, బాబుకి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులు, అంత మంది సంతానం ఉన్నా ముసలి వయసులో ఎన్టీఆర్‌ని ఎవ్వరూ ఆదరించకపోవడం, ఇక ఆయన మరణించే ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో జామాత దశమగ్రం, అల్లుడు, తన సంతానమే తనని మోసం చేసిందని ఎన్టీఆర్ వ్యాఖ్యానించిన విషయాలన్నీ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో ఉండే అవకాశం ఉందని దీని ద్వారా స్పష్టమవుతోంది.